![పెండింగ్ బిల్లులు చెల్లించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/19/18nrl276-340134_mr-1734573926-0.jpg.webp?itok=lLS236Y_)
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్
నిర్మల్‌చైన్‌గేట్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ కోరారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించేందుకు మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి తిప్పలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే మెనూకు ఇప్పుడున్న మెస్ చార్జీలు ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల మాదిరిగా ప్రభుత్వమే నేరుగా అన్ని పాఠశాలలకు గుడ్లు సరఫరా చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కె రాధ మాట్లాడుతూ కట్టెల పొయ్యిలపై వంట చేయడంతో కార్మికులు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు, గుర్తింపు కార్డులు, ప్రొసీడింగ్ ఆర్డర్స్, కాటన్ దుస్తుల డ్రెస్‌కోడ్, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. అనంతరం ఈనెల 21 నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు వంట బంద్ చేసి సమ్మెకు పోవడం జరుగుతుందని డీఈఓ కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి, సత్యవ్వ, సహాయ కార్యదర్శి గంగధర్, విజయ, భాను, పద్మ, సవితబాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment