గోడు వింటున్నారు.. గోస తీర్చడం లేదు
● ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ● పరిష్కారానికి చొరవ చూపాలని వినతి
నిర్మల్‌చైన్‌గేట్: ‘ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. అందరి ఆశ ఒక్కటే.. ఉన్నతాధికారులు స్పందించి బాధలను అర్థం చేసుకోవాలని’. సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం వంటి సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ వారం ప్రజావాణికి 42 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 91.62 శాతం ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తయిందని, మిగిలిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కేజీబీవీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ నివేదికలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment