● ఒకరిని కాపాడబోయి మిగతావారు
మరణించి ఉండొచ్చు
● ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్‌ల
మృతి కేసుపై ఎస్పీ సింధు శర్మ
కామారెడ్డి క్రైం: సంచలనం సృష్టించిన ముగ్గురి మృతి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడారు. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పీఎస్ కానిస్టేబుల్ శ్రుతి, సహకార బ్యాంకు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్‌ల మృతి కేసుపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ముందుగా దూకిన ఒకరిని కాపాడబోయే ప్రయత్నంలో మిగతా ఇద్దరు కూడా నీట మునిగి చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అంటూ ఎవరూ లేకపోవడంతో సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఏం జరిగింది అనే దానిపై స్పష్టత రాలేదన్నారు. వారు నీట మునిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉంటుందన్నారు. ఈత రాని వారు అందులో పడితే బయటకు రావడం సాధ్యం కాదన్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా, ఆత్మహత్యలా అనేది తెలియడం లేదన్నారు. మృతుల సెల్‌ఫోన్‌లు, నీటి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. నివేదిక రావాల్సి ఉందని, సాంకేతిక అంశాల ఆధారంగా పరిశోధన చేస్తున్నామని తెలిపారు. మృతిచెందిన ఎస్సై సాయికుమార్‌పై గతంలో ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు.
ఏటీఎంలో చోరీకి యత్నం
ఖలీల్‌వాడి: నగరంలోని పెద్ద బజార్‌లో గల ఏటీఎంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఓ వ్యక్తి చోరీకి యత్నించినట్లు ఎస్సై యాసీన్ ఆరాఫత్ తెలిపారు. ఏటీఎంను పగులగొట్టడానికి యత్నించగా శబ్దం రావడంతో స్థానికుడు కేకలు వేశాడు. దీంతో దొంగ పరారయ్యాడు.
చోరీ కేసులో ఒకరి రిమాండ్
ఖలీల్‌వాడి: చోరీ కేసులో నగరంలోని కోటగల్లీకి చెందిన ఎలిగేటి నాగరాజును రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. ఈ నెల 28న కోటగల్లీలోని శశిరేఖ ఇంట్లోకి చొరబడి నాగరాజు రూ.10వేలు, సిలిండర్ చోరీ చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని నగదు, సిలిండర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment