మార్పులు చేర్పులపై నేటి నుంచి సర్వే
మోర్తాడ్(బాల్కొండ): గతంలో జారీ చేసిన రేషన్ కార్డులలో అదనంగా పేర్ల నమోదు, ఇతర మార్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో సోమవారం నుంచి పరిశీలన మొదలుకానుంది. ఐదారేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించనుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులలో పుట్టిన పిల్లలు, కొత్త కోడళ్ల పేర్లను ఎక్కించడం ఇలా అనేక రకాల మార్పుల కోసం ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌ను మూసి ఉంచడంతో మార్పులు చేర్పులకు అవకాశం లభించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టడంతో మార్పులు చేర్పులకు అవకాశం వచ్చింది. గతంలో రెవెన్యూ శాఖకు అందిన దరఖాస్తులకు సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి వేగంగా సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు అందించింది. జిల్లాలో రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు సంబంధించి 77,758 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులను రెవెన్యూ అధికారులు తెలుసుకుని పౌర సరఫరాల శాఖకు నివేదించనున్నారు.
రేషన్ కార్డుల్లో
పేర్ల నమోదుకు అవకాశం
క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న
రెవెన్యూ అధికారులు
గ్రామ సభల ఆమోదంతో లబ్ధిదారుల ఎంపిక
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం గ్రామ సభల ఆమోదం తీసుకోనున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం 39 వేల దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తుల పరిశీలన క్షేత్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖాధికారులు నిర్వహిస్తున్నారు. ఈ సర్వే సోమవారంతో పూర్తి కానుండగా మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలను ఏర్పాటు చేయనున్నారు. సమగ్ర సర్వే వివరాల ఆధారంగా ప్రజాపాలనలో వచ్చిన రేషన్ దరఖాస్తులలో అర్హత ఉన్నవి ఏమిటి అర్హత లేనివి ఏమిటో అధికారులు తేల్చారు. సర్వే వివరాలను గ్రామ సభలలో వెల్లడించి తీర్మానం తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
వివరాలు అందించాం
గతంలో జారీ చేసిన రేషన్ కార్డులలో పేర్ల నమోదు, తొలగింపులకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల వివరాలను రెవెన్యూ శాఖకు అందించాం. అధికారులు సర్వే సర్వే పూర్తి చేసిన తర్వాత కార్డులలో మార్పులు చేర్పులు చేపడుతాం.
– అరవింద్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment