కృష్ణలంకకు సంరక్షణ | - | Sakshi
Sakshi News home page

కృష్ణలంకకు సంరక్షణ

Published Sat, Jul 29 2023 2:18 AM | Last Updated on Sat, Jul 29 2023 2:18 AM

మాట్లాడుతున్న హోం మంత్రి తానేటి వనిత, చిత్రంలో కలెక్టర్‌ ఢిల్లీరావు తదితరులు - Sakshi

మాట్లాడుతున్న హోం మంత్రి తానేటి వనిత, చిత్రంలో కలెక్టర్‌ ఢిల్లీరావు తదితరులు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రకాశం బ్యారేజీ దిగువన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంతో కృష్ణలంక వాసులు నిశ్చితంగా ఉంటున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తానేటి వనిత అన్నారు. నదికి వరద వచ్చినా కరకట్ట ప్రాంత ప్రజలు ముంపు నుంచి రక్షణ పొందుతారన్నారు. ఇప్పటికే రిటైనింగ్‌ వాల్‌ రెండు దశల నిర్మాణం పూర్తయిందన్నారు. మూడో దశ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి మంత్రి తానేటి వనిత అధ్యక్షతన విజయవాడ తూర్పు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కృష్ణానదికి వరద వస్తే కృష్ణలంక వాసులు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టగానే వరద ముంపు నుంచి లంక వాసులకు రక్షణ కల్పిస్తూ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టిందన్నారు. మూడు దశలు పూర్తయితే నదికి ఎంత వరద వచ్చిన కృష్ణలంక వాసులకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవన్నారు.

జగనన్న సురక్ష ప్రజలకు రక్ష..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు రక్షగా నిలుస్తోందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. దీని ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నూరు శాతం సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సురక్ష కార్యక్రమంలో 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. గతంలో ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తీసుకువచ్చిన వినూత్న సంస్కరణలతో నేరుగా ఇంటి వద్దే అన్ని సేవలు అందుతున్నాయన్నారు.

తూర్పు నియోజకవర్గ

సమస్యలు పరిష్కరించాలి..

తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ నియోజకవర్గ పరిధిలో నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖలకు చెందిన సమస్యలను ప్రస్తావించారన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలకు పరిష్కారం చూపి నిధులు అవసరమయ్యే పనులకు సంబంధించి అధికారులను అంచనాల నివేదికలు రూపొందించాలని ఆదేశించినట్లు చెప్పారు. నియోజకవర్గానికి సంబంధించి టిడ్కో గృహాల మంజూరు, జగనన్న కాలనీ గృహ నిర్మాణాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాలుగేళ్లుగా సుదీర్ఘ సమస్యలైన చాకలిచెరువు, కుమ్మరి చెరువు, రెల్లి చెరువు ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు, కృష్ణలంక రుద్రభూమి ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి శాశ్వత పట్టాలకు అర్హత మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 19వ డివిజన్‌లో రూ. 2 కోట్ల నిధులతో షాదీఖానా నిర్మిస్తామన్నారు. వీటిలో రూ. కోటి నిధులు నగరపాలక సంస్థ సమకూరుస్తోందన్నారు. కృష్ణలంకలో కాపు కమ్యూనిటీ హాల్‌ నిర్మించేందుకు త్వరలో స్థల సేకరణ చేపడతామన్నారు. సమావేశంలో కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, నగరపాలకసంస్థ అదనపు కమిషనర్లు శ్యామల, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంతో వరద భయం నుంచి విడుదల తూర్పు నియోజకవర్గ సమీక్షలో మంత్రి తానేటి వనిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement