గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా
నూతన మద్యం పాలసీపై మండిపాటు
చల్లపల్లి(అవనిగడ్డ): ఏపీ ప్రభుత్వం తీసుకున్న నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కృష్ణాజిల్లా శాఖ ఆధ్వర్యంలో చల్లపల్లిలో గాంధీజీ విగ్రహం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి మాట్లాడుతూ మద్యం షాపుల సంఖ్య విపరీతంగా పెంచడంతోపాటు పనిచేసే సమయాన్ని పెంచడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం షాపుల బయట అక్రమ అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, మద్యంపై వచ్చే ఆదాయంలో రెండుశాతం మద్యంతో కలిగే నష్టాలు, అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఖర్చు చేయాలన్నారు. ప్రతి పీహెచ్‌సిలో డీ ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ అధీనంలో మాత్రమే మద్యం షాపులు నిర్వహించాలని, ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమాఖ్య నాయకులు కంచర్ల ప్రభుకుమారి, వేములపల్లి నాగేంద్రమ్మ, కుర్రా అరుణ కుమారి, అట్లూరి స్వరూప, దాసి కోటేశ్వరమ్మ, సీపీఐ నాయకులు మల్లుపెద్ది బోసు, అట్లూరి వెంకటేశ్వరరావు, సిద్దాబత్తుల వాసు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment