హాబీగా నాటు కోళ్ల పెంపకం చేపట్టిన యువకుడు
వారానికి 15 నుంచి 20 క్వింటాళ్ల కోళ్ల ఎగుమతి
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రవాణా
గుడ్లవల్లేరు: గ్రామాల్లో యువకులు నాటుకోళ్లను పెంచుతున్నారంటే కోడి పందేల కోసమే అన్న అభిప్రాయం సాధారణంగా అందరిలో వ్యక్తమవు తుంది. అయితే గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన యువకుడు మెరుగుమాల బాల సుబ్రహ్మణ్యం(బాలు) హాబీగా చేపట్టిన నాటుకోళ్ల పెంపకం లాభాల పంట పండిస్తోంది. ఆశీలు జాతి నాటుకోళ్లను పెంచుతూ లాభాలు గడిస్తున్నాడు. పల్లె వాతావరణంలో ఆరోగ్యకరమైన మాంసానికి అవసరమైన నాటుకోళ్ల పెంపకం కనుమరుగవుతున్న రోజులివి. ఇంజెక్షన్లతో పెరిగే జాతుల కోళ్లను పెంచే ఫారాలు మార్కెట్లో అధికమవుతున్నాయి.
ఈ తరుణంలో బాలు ఆశీలు జాతి మాంసపు కోళ్లను పెంచటమే కాకుండా ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాడు. తనకు చిన్నప్పట్నించి కోళ్ల పెంపకం మీద ఉన్న హాబీని ఆదాయ వనరుగా మార్చుకోవడమే గాక తనతో పాటు పలువురికి ఉపాధిని కల్పించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. అంగలూరు – గుడివాడకు మధ్యలో ఎంఎన్‌కే రహదారి పక్కనే వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఎకరం స్థలంలో ఈ కోళ్ల పెంపకాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నాటుకోళ్ల ఫారం బయట మాంసం విక్రయించేందుకు స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. ఎక్కువగా ఊరి బయట పొలాల మధ్యలోనే ఆరోగ్యకర పద్ధతుల్లో నాటు కోళ్ల పెంపకం కొనసాగుతోంది.
అక్కడ పెంపకం పూర్తయ్యాక మార్కెట్ యార్డు వద్దనున్న ఫారానికి కోళ్లను తీసుకొచ్చి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. తొలుత 2016లో తన స్నేహితులు పావులూరి రమేష్, లేమాటి సత్యనారాయణతో కలిసి బాలు నాటుకోళ్ల పెంపకం ప్రారంభించారు. తొలి రెండేళ్లలో నష్టాలు ఎదురయ్యాయి. కోడి పిల్లలను తెచ్చేటప్పుడు అతనికి నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత ఐదేళ్లగా తమిళనాడు నుంచి తెస్తున్న ఆశీలు జాతి కోళ్ల పెంపకంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకపోగా లాభాలు బాట పట్టారు.
వారానికి 15 నుంచి 20 క్వింటాళ్ల కోళ్లను ఎగుమతి చేస్తున్నారు. పండుగలు, అమ్మవారి ఆలయాల ఎదుట, గ్రామాల్లో విక్రయించే చిరు వ్యాపారులు కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి కోళ్లను హోల్‌సేల్ ధరలకు తీసుకెళ్తుంటారు. ఏలూరు, భీమవరం, కై కలూరు, ముదినేపల్లి, గుడివాడ, గుడ్లవల్లేరు, వేమవరం, వడ్లమన్నాడు, పెడన, మచిలీపట్నం, విజయవాడ, ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు, హనుమాన్ జంక్షన్ వంటి నుంచే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాదు, కామారెడ్డి వంటి ప్రాంతాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి ఈ కోళ్లను కనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఏడాది పొడవునా ఈ మాంసపు కోళ్ల వాడకం ఉంటుంది. దసరా, సంక్రాంతి సమయాల్లో ఎక్కువగా ఎగుమతులు ఉంటాయి.
ఆశీలు కోడి మాంసం శ్రేష్ఠమే..
ఆశీలు జాతి కోళ్ల మాంసం బ్రాయిలర్ కోళ్ల మాంసం కంటే చాలా శ్రేష్ఠం. ఒక్కొక్క కోడి రెండు నుంచి 2.5 కిలోల వరకూ బరువు పెరుగుతుంది. వీటి మాంసం ఎర్రగానే ఉంటుంది. బ్రాయిలర్ కోళ్ల మాంసంలో కొవ్వు ఎక్కువ, మాంస కృత్తులు తక్కువ ఉంటాయి. ఆశీలు జాతి కోడి మాంసంలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ కోళ్ల మాంసంలో ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్లు బీ6, బీ3, సెలినియం, జింక్, అయోడిన్ వంటిని అధి కంగా ఉంటాయి. వీటి పెంపకంలో ఎలాంటి రసాయనాలు, యాంటీ బయాటిక్స్, హార్మోన్లు వాడరు. ఎక్కువ గుడ్లు పెట్టడం వల్ల వాటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది.
– డాక్టర్ బి.శ్రీవీణ, వెటర్నరీ వైద్యాధికారి
నిలబడితేనే విజయం
ఏడేళ్లుగా నాటుకోళ్లను పెంచుతున్నాను. తొలి రెండేళ్లలో ఎన్నో ఒడి దొడుకులు వచ్చాయి. నష్టాలు వచ్చినా వెనుకడుగు వేయలేదు. స్నేహితులు కూడా నా మీదున్న నమ్మకంతో నాకే కోళ్ల పెంపకాన్ని వదిలేశారు. దాని వల్ల మరింత బాధ్యత పెరిగింది. ఐదేళ్లగా లాభాల బాటలో నడుస్తున్నాం. కష్టాలు ఎదురైనా నిలబడితేనే విజయం వరి స్తుందని నిరూపణ అయ్యింది. ప్రజలు తినే ఈ నాటుకోళ్ల మాంసం ఎంతో ఆరోగ్యకరమని ముందుగా డాక్టర్ల ద్వారా తెలుసుకునే పెంపకాన్ని ప్రారంభించాను. కోళ్ల పెంపకంలో వాటికి ఎలాంటి రుగ్మతలు రాకుండా సమయానికి వ్యాక్సినేషన్ చేయిస్తా.
– మెరుగుమాల బాల సుబ్రహ్మణ్యం(బాలు), నాటుకోళ్ల పెంపకందారు
Comments
Please login to add a commentAdd a comment