హామీల అమలులో ‘కూటమి’ విఫలం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ప్రజలు ఆందోళన బాట పట్టారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజాసమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలి, టిడ్కో ఇళ్లు ఇవ్వాలి వంటి డిమాండ్లతో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘మాది మంచి ప్రభుత్వం’ అని కూటమి ప్రచారం చేస్తోందని, హామీలు అమలు చేస్తే ప్రజలే మంచి ప్రభుత్వమని గుర్తిస్తారన్నారు. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగాయని, అవినీతి రాజ్యమేలుతోందని, మహిళలకు రక్షణ కరువైందన్నారు. యూపీలో ఆదిత్యనాథ్ తరహాలో తప్పు చేసిన వారిని కాల్చేయాలంటూ పవన్ కల్యాణ్ అనడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియను నిలుపదల చేయాలన్నారు. అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, శ్రీదేవి, విజయవాడ సెంట్రల్ సిటీ కార్యదర్శి బి. రమణారావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment