రోడ్డు ప్రమాదంలో కోర్టు కానిస్టేబుల్ మృతి
ఉయ్యూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొని కోర్టు కానిస్టేబుల్ మృతి చెందాడు. ఘటన జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌లో మత్తె రామకోటేశ్వరరావు (37) కోర్టు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య దుర్గాభవాని ఎకై ్సజ్ కానిస్టేబుల్. ఆమె గొడవర్రు డిస్టలరీలో పనిచేస్తున్నారు. భార్య దుర్గాభవాని విధులు పూర్తికావడంతో రామకోటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై ఉయ్యూరు తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో ఆకునూరు వద్ద జాతీయ రహదారిపై మచిలీపట్నం వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఘటనలో కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గాభవానికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆమెను విజయవాడకు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ సురేష్‌బాబు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రామకోటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రామకోటేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోస్టుమార్టం అనంతరం గురువారం మృతదేహాన్ని స్వగ్రామం డోకిపర్రు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు. కానిస్టేబుల్ మృతిపై కుటుంబసభ్యులు, సహచర ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఘటనా స్థలాన్ని ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. ఘటనకు కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment