22 నుంచి ఫల, పుష్ప ప్రదర్శన
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి నాలుగు రోజుల పాటు నగరంలో ఫల, పుష్ప ప్రదర్శన జరుగుతుందని సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.ఉషారాణి, జి.లక్ష్మి తెలిపారు. టిక్కిల్ రోడ్డులోని సొసైటీ సభ్యురాలి నివాసంలో గురువారం ప్రదర్శన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఉషారాణి, లక్ష్మి మాట్లాడుతూ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో ఈ ప్రదర్శనను విజయ వాడ కార్పొరేషన్, అర్బన్ గ్రీనరీ, ఉద్యాన శాఖ సహకారంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనలో వివిధరకాల చామంతులు, గులాబీలు, మందార, నారింజ, మామిడి, జామ వంటి ఫలం, పుష్ప మొక్కలతో పాటు, ఇంట్లో అలంకరణగా మొక్కలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.వి.సీతామహాలక్ష్మి, పద్మప్రియ, రత్నలక్ష్మి పాల్గొన్నారు.
దుర్గమ్మ సేవలో
గురుదేవ్ రవిశంకర్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ రవిశంకర్ గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆయ నకు ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు సాదరంగా స్వాగతం పలకారు. రవిశంకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఈఓ రామరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వేద పాఠశాలకు చెందిన వేద విద్యార్థులు ఆశీర్వచన మండపంలో రుద్రపారాయణం చేయగా, గురుదేవ్ రవిశంకర్ వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఆలయ వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, కోట రవి, సాయి తదితరులు పాల్గొన్నారు.
17న మారథాన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించేలా నడకను అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 17న విజయవాడ నగరంలో మారథాన్ జరుగుతుందని నిర్వాహకుడు మణిదీపక్ తెలిపారు. విజయవాడ రన్నర్స్ సొసైటీ, శ్రీరామ్ ఫైనాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో బీఆర్‌టీఎస్ రోడ్డులో మారథాన్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంజీరోడ్డులోని ఓ హోటల్‌లో మారథాన్‌కు సంబంధించిన టీషర్ట్, మెడల్‌ను గురువారం ఆవిష్కరించారు. అనంతరం మణిదీపక్ మాట్లాడుతూ.. నగర యువత కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ కె.వి.ఆర్.కె.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా మారథాన్ నిర్వహణలో భాగస్వాములవుతున్నట్లు తెలిపారు. మారథాన్‌కు తాము స్పాన్సర్‌లుగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మారథాన్‌లో పాల్గొనే వారు పేర్లు నమోదుకు 78159 55123 నంబరులో సంప్రదించాలని కోరారు.
సికింద్రాబాద్ – లక్నో
మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వయా గుంటూరు, విజయవాడ మీదుగా సికింద్రాబాద్–లక్నో మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్–లక్నో ప్రత్యేక రైలు (07084) ఈ నెల 15, 22 తేదీల్లో శుక్రవారం రాత్రి 7.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు లక్నో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07083) ఈ నెల 18, 25 తేదీల్లో సోమవారం ఉదయం 9.50 గంటలకు లక్నోలో బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు తదితర స్టేషన్లలో ఆగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment