విజయవాడస్పోర్ట్స్: ప్రేమ పేరుతో 17 ఏళ్ల బాలికను నమ్మించి ఆమైపె పలుమార్లు లైంగికదాడి చేసిన యువకుడికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయ మూర్తి వి.భవాని మంగళవారం తీర్పు చెప్పారు. ఇంటర్మీడియెట్ చదువుతూ మొగల్రాజపురంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న బాలికకు కానూరు సనత్‌నగర్‌కు చెందిన పోతిన నాని అలియాస్ మహేంద్ర(21) ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి బాలికను మచిలీపట్నం బీచ్ వద్ద ఉన్న రిసార్ట్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత హైదరాబాద్, ముంబై తీసుకెళ్లి అక్కడ పలుమార్లు లైంగికదాడి చేశారు. బాలిక కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 2015 అక్టోబర్‌లో వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. బాధితురాలి తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కృష్ణవేణి కోర్టులో వాదనలు వినిపించారు. పది మంది సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు పోతిన నాని అలియాస్ మహేంద్రకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించిన జరిమానాలో రూ.5 వేలతో పాటు, మరో రూ.4 లక్షలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీని న్యాయమూర్తి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment