భవానీపురం(విజయవాడపశ్చిమ): డబ్బున్న వారికే రాజ్యసభ సీటు ఇచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలను వంచించి తమ నైజాన్ని బయట పెట్టుకుందని వైఎస్సార్ సీపీ నాయీబ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తొండమల్లు పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీసీలను మభ్యపెట్టి ముగ్గురు రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి వారికి మొండి చెయ్యి చూపించిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. బీసీల కోసం ఎక్కడి వరకైనా వెళ్తాననే ఆర్.కృష్ణయ్య స్వప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. హవాలా, మనీ లాండరింగ్ కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సాన సతీష్‌కు రాజ్యసభ ఇవ్వడం చంద్రబాబుకే చెల్లిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంతో మంది బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కిందని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా బీసీలను నియమించిన సామాజిక న్యాయవేత్త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వివరించారు. తనకు కులం, మతం లేదని చెప్పుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని గ్రహించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment