మైనింగ్ మంత్రి ఇలాకా.. కూటమి తాలూకా..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మైనింగ్ శాఖ మంత్రి ఇలాఖాలో అవినీతి దందా పెరిగిపోతోంది. కూటమి అండతో అవినీతిపరులు చెలరేగిపోతున్నారు. అదేమని ఎవరైనా అడిగితే మేమింతే అడ్డొస్తే అంతే అంటూ బెదిరిస్తున్నారు. అక్రమమార్గంలో అడ్డంగా దోచేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న సంబంధిత అధికా రులు పట్టించుకోవడం లేదు. దున్నేవాడిదే భూమి అన్న చందంగా తవ్వుకున్న వాడితే మట్టి అనుకుంటున్నారో ఏమో గ్రామాల్లో అయినకాడికి మట్టిని మాయం చేసేస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ మట్టి దందాను ఎదుర్కోలేక, వారు ఇచ్చే ముడుపులు తీసుకుని చూసీ చూడనట్లు ఉంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ మూడు గ్రామాల్లో..
బందరు మండలంలోని గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి గ్రామాల్లో మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆయా గ్రామాలకు చెందిన కూటమి నాయకులు మట్టిని మాయం చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పోర్టు భూముల్లోని మట్టిని అయిన కాడికి తవ్వి బయటి ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని దూరాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో చీకటి రాజ్యంలో కార్యకలాపాలు సాగించిన వారు, ప్రస్తుతం పట్టపగలే మట్టి తవ్వుకుని అమ్మేసుకుంటున్నారు. గోపువానిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి కొడుకు, కరగ్రహారంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీ నేతల అండతో మట్టి దందాను సాగిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం.
వందల ఎకరాల్లో మట్టి మాయం
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ మూడు గ్రామా లకు సంబంధించి వందల ఎకరాల పోర్టు భూముల్లోని మట్టి తవ్వి అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమ తమ స్థాయిని బట్టి కూటమి నేతల దగ్గర వారికున్న పలుకుబడి, పరపతిని బట్టి రూ.లక్షలు, రూ.కోట్లు దిగమింగినట్లు ప్రచారం సాగుతోంది. మైనింగ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గమైన మచిలీ పట్నంలో మట్టి దందా సాగుతున్నా పట్టించుకోకపోవడం సర్వత్ర విమర్శలకు దారి తీస్తోంది. దీంతో నియోజకవర్గ ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
మచిలీపట్నం మండలంలో మట్టి దందా చెలరేగిపోతున్న మట్టి మాఫియా మామూళ్ల మత్తులో అధికారులు
కచ్చితంగా చర్యలు తీసుకుంటాం
పోర్టుభూముల్లో మట్టిని తవ్వితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మట్టి ట్రాక్టర్‌లను అడ్డుకుని కేసులు నమోదు చేస్తాం. వాటికి జరిమానా విధించటంతో పాటు వాహనాలను సీజ్ చేస్తాం. సిబ్బందిని అప్రమత్తం చేసి పోర్టు భూముల్లో మట్టి తరలిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.
– పి.మధుసూదనరావు,
తహసీల్దార్, బందరు
Comments
Please login to add a commentAdd a comment