లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల పదో తేదీ వచ్చినా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడలేదు. ప్రతినెలా మొదటి తేదీనే పడే జీతాలు పదో తారీఖు వచ్చినా పడలేదు. దీంతో జీతాలు ఎప్పుడు పడతాయా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దాదాపు 300 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో స్టాఫ్ నర్సులతో పాటు, నాల్గో తరగతి ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్‌లు ఉన్నారు. గతంలో ప్రతినెలా మొదటి తేదీనే జీతాలు రావడంతో ఆ భరోసాతో కొందరు ఉద్యోగులు చిన్న చిన్న రుణాలు తీసుకున్నారు. వాటికి ప్రతినెలా ఏడు నుంచి పదో తేదీలోపు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు జీతాలు పడక పోవడంతో తాము ఈఎంఐలు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని చిరుద్యోగులు వాపోతున్నారు. మరికొందరు ఇంటి అద్దెలు చెల్లించేందుకు అప్పులు చేస్తున్నారు.
గతంలో ప్రతినెలా మొదటి తేదీనే
ఒకప్పుడు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల కింద పనిచేసే వారు. వారు ప్రభుత్వం నిధులు ఇచ్చినా, ఉద్యోగులకు సరిగా జీతాలు ఇచ్చేవారు కాదు. ఈ విషయాన్ని గ్రహించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఈ కార్పొరేషన్ పరిధిలోని తీసుకొచ్చారు. దీంతో ప్రతినెలా పర్మినెంట్ ఉద్యోగుల కంటే ముందుగానే అవుట్‌సోర్సింగ్ ఉద్యో గులకు జీతాలు చెల్లించేవారు. దీంతో ఉద్యోగులు సైతం తమకు ప్రతినెలా జీతం వస్తుందనే ధైర్యంతో ఉండేవారు.
మళ్లీ కష్టాలేనా..
ప్రస్తుతం పదోతేదీ వచ్చినా జీతాలు ఇవ్వక పోవడంతో మళ్లీ తమకు గతంలో ఎదుర్కొన్న కష్టాలు రానున్నాయా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్‌సోర్సింగ్‌లో ఉన్న వార మంతా చిరుద్యోగులమేనని, తక్కువ జీతాలకు పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు సత్వరమే విడుదల చేయాలని కోరుతున్నారు.
పదో తేదీ దాటినా ఎదురుచూపులే గతంలో మొదటి తేదీనే ఇచ్చిన వైనం
Comments
Please login to add a commentAdd a comment