ఎన్నికల హామీల అమలుకు 23న ధర్నా
కృష్ణలంక(విజయవాడతూర్పు): భవన, ఇతర నిర్మాణ కార్మికులకు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సంక్షేమబోర్డు పథకాలను పునరుద్ధరించాలని, మెమో నంబర్ 1214ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 23న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుట్టెపు అప్పారావు, పిల్లి నరసింహారావు కోరారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డును పనిచేయించి పథకాలను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మ్యానిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే యూనియన్ ద్వారా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికా రులకు అనేకసార్లు విన్నవించామని, తమ సమస్యలను పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది వలస కార్మికులు వచ్చి పనిచేస్తున్నారని, వారికి ఇక్కడ ఆధార్ కార్డు లేదని సంక్షేమబోర్డులో చేర్చుకోకపోవడంతో వారికి ఎలాంటి పథకాలు అందటం లేదని వివరించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కార్మికులందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, కోశాధికారి బి.బెనర్జీ, వి.బి.రాజు, ఎం.బాబూరావు, డి.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment