పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లాలో మామిడి పంటకు ప్రభుత్వం వాతావరణ ఆధారిత బీమా పథకంలో అవకాశం కల్పించిందని ఉద్యానవన శాఖాధికారి టి.వర్ధిని తెలిపారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ.. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో బీమా చెల్లింపునకు ఒప్పందం చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రైతులు బీమా ప్రీమియం ఎకరానికి రూ.2050 చొప్పున డిసెంబర్ 15వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతింటే ఎకరానికి రూ.41 వేల నష్టపరిహారం వస్తుందని పేర్కొన్నారు. ఈ బీమా కాలాన్ని ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది మే 31వ తేదీగా నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో అధిక వర్షం, వాతావరణ వ్యత్యాసం, అధిక గాలులు తదితర కారణాలతో నష్టం వాటిల్లితే ప్రభుత్వం నిబంధనల మేరకు అంచనా వేసి బీమా వర్తింపజేస్తారని వివరించారు. ప్రీమియం చెల్లింపునకు రైతులు తమ బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు, పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు, పంట వేసినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. ఈ పథకం ఐదేళ్లకు పైబడిన చెట్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. రైతులు కామన్ సర్వీస్ సెంటర్ లేదా సమీపంలోని బ్యాంక్ లేదా పీఎంఎప్‌బీవై పోర్టల్ ద్వారా మొబైల్‌లో ప్రీమియం చెల్లించొచ్చని సూచించారు. వివరాలకు రైతు సేవా కేంద్రాల్లో లేదా ఉధ్యానవన శాఖాధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment