కల్తీ.. ఆహాకారం
● కల్తీ ఆహారంతో గుండెపోటు, మెదడుపోటు ముప్పు ● జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్‌కు దారితీస్తున్న వైనం ● ఆహార నియమాలు తప్పనిసరి అంటున్న వైద్యులు ● మాంసాహారం మితంగా తీసుకోవాలని సూచనలు
లబ్బీపేట(విజయవాడతూర్ఫు): కల్తీ ఆహారం, సమపాలన లేని ఆహారపు అలవాట్లు కొంపముంచుతున్నాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఆస్పత్రుల పాలుచేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల్లో బిర్యానీలు, ఇతర మాంసాహార వంటకా లను లాంగించేస్తుండటంతో తొలుత జీర్ణాశయ వ్యాధులు ఆశించి, ఆ తరువాత ప్రాణాపాయ స్థితికి దారితీస్తున్నాయి. ఇటీవల నగరంలో నమోదవుతున్న లివర్ సిర్రోసిస్, పాంక్రియాటైటీస్, క్యాన్సర్ కేసులను చూస్తుంటే ఆందోళన కలిగిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. నాలుగు పదుల వయస్సులోనే జీర్ణాశయ, పెద్దపేగు, లివర్ క్యాన్సర్ సోకుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ రకం వ్యాధులే ఎక్కువగా వెలుగుచూస్తున్నాయని, అన్నవాహిక క్యాన్సర్‌లు కూడా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో పెనుముప్పు పొంచి ఉన్నట్లేనని హెచ్చరిస్తున్నారు.
కొంపముంచుతున్న కల్తీ
నాన్‌వెజ్ వంటకాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలు కలిసిన కారంపొడులు ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాకుండా మృత జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన కల్తీ నూనెలు వినియోగించి వంటలు చేస్తుండటంతో జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అందుకు ఫుడ్ కంట్రోల్ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కల్తీ ఆహారాన్ని గుర్తించడమే నిదర్శనంగా పేర్కొంటున్నారు. బయట ఆహారం తినడాన్ని తగ్గించడం ఎంతో ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. కల్తీ ఆహారమే క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జీర్ణకోశ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్‌లకు కల్తీ ఆహారమే ప్రధాన కారణమని స్పష్టంచేస్తున్నారు.
జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్న వైనం
ఆహార నియమాలు పాటించక పోవడంతో ఒబెసిటీకి దారితీసి క్రమేణా జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారికి మధుమేహం, రక్తపోటుతో పాటు, హైపో థైరాయిడ్ వంటి వ్యాధులు సోకుతున్నాయని వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటించడంతో పాటు, వ్యాయామం చేయడం అవసరమని సూచిస్తున్నారు. అప్రమత్తం కాకుంటే వ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నాయి
మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జీర్ణకోశవ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గ్యాస్ట్రైటీస్, కొలైన్ సమస్యలతో పాటు, లివర్, పాంక్రియాస్ ఇబ్బందులతో చాలా మంది మా వద్దకు వస్తున్నారు. వారికి పరీక్షలు చేసి మందులు ఇస్తున్నాం. కొందరిలో ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. ఆహార నియమాలు పాటిస్తూ, కల్తీ ఆహారాన్ని మానుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
– డాక్టర్ బి.ఎస్.వి.వి.రత్నగిరి,
అసోసియేట్ ప్రొఫెసర్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ
Comments
Please login to add a commentAdd a comment