వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామ/వార్డు వలంటీర్ వ్యవస్థను కొనసాగించి ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఎన్నికల ముందు వలంటీర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతూ ఏపీ వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 గంటల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. బుధవారం విజయవాడలోని దీక్ష శిబిరంలో పాల్గొని వలంటీర్లకు రామకృష్ణ మద్దతు తెలిపారు. 50 గంటలు పూర్తికావ డంతో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వలంటీర్లు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ఎన్నికల్లో సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వలంటీర్లకు ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీని అమలు చేసి ముఖ్యమంత్రి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. వలంటీర్ల గురించి రాష్ట్రంలో మంత్రులు తెలిసీ తెలియనట్లుగా మాట్లాడటం బాధాకరమన్నారు. వరదల సమయంలో వలంటీర్లను ఏ విధంగా వినియోగించుకున్నారని ప్రశ్నించారు. నిన్న మొన్నటి వరకు సచివాలయాల్లో వలంటీర్ల అటెండెన్స్ తీసుకున్నారని, నేడు దాన్ని కూడా రద్దు చేయడం బాధాకరమన్నారు. వలంటీర్లను పార్టీలకు ఆపాదించడం సరికాదన్నారు. కూటమి పెద్దలు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. దీక్షలో పాల్గొన్న వలంటీర్లు మమత, సరోజిని స్వల్ప అస్వస్థకు గురికావడంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ దీక్షలో లంకా గోవిందరాజులు, వలంటీర్లు కుమార్, శిరీష, వెంకటసుబ్బయ్య, రాజే ష్, వాసు తదితరులు పాల్గొన్నారు. శిబిరాన్ని సందర్శించిన వారిలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, లంకా గోవిందరాజులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఉన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment