కళ తప్పిన రంగస్థలం
అలనాడు నాటకాలు ప్రజల్లో విజ్ఞానం, మానసికోల్లాసంతో పాటు చైతన్యం తీసుకొచ్చేవి. ప్రేక్షకుల జీవితాల్లో ఒక భాగమై రంజింపజేసేవి. స్వాతంత్య్రోద్యమంలో నాటకాలు కీలకపాత్ర పోషించి సమరోత్సాహానికి ఊపిరులూదాయి. మన జిల్లాలో నాటకాల స్థాయి నుంచే ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్ వంటివారు సినిమా రంగంలోకి వెళ్లి రాణించారు. క్రమక్రమంగా సినిమాలు నాటకాల స్థానాన్ని ఆక్రమించాయి. దాదాపుగా పాతికేళ్లుగా వాటి ప్రాభవం తరిగిపోతూ వస్తోంది. ఈ క్రమంలో రంగ స్థల కళాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వాలు కూడా వీరిని చిన్నచూపు చూస్తున్నాయి.
గుడ్లవల్లేరు: ఏ పాత్రలోకైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి తమకు తామే సాటి అని నిరూపించుకున్న కళామ తల్లి ముద్దు బిడ్డలు మన జిల్లాలో ఎందరో ఉన్నారు. నాటక రంగ అభిమానుల హర్షధ్వానాలు, ఈలలు, వన్స్‌మోర్ గోలలే వారికి కోట్లాది రూపాయల పారితోషికాలుగా భావించి వారు నటించేవారు. ముచ్చట గొలిపే డ్రెస్సులు, ముఖానికి పంచ వన్నెల మేకప్‌లు, వేదిక మీదకు వెళ్లగానే ముఖంపై పడే ఫోకస్ లైట్లు, ఆ రంగుల ప్రపంచంలో తమ జీవితాల్ని హారతి కర్పూరంలో కరిగించుకుంటూ కళా సామ్రాట్లుగా ఆనాడు వెలుగొందిన అనేక మంది కళాకారులు నేడు బతుకు బండిని లాగలేక, బయటకు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ప్రభుత్వాలు ఆదుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు నాటకాల ప్రదర్శనలిచ్చేలా ప్రోత్సహించే వారు.. ప్రస్తుతం దీనిని ప్రభుత్వాలు పక్కన పెట్టేయటంతో ఆ రంగం వైపు ఎవరూ కనీసం ఆసక్తి కూడా చూపడం లేదు.
పింఛన్ల విషయంలో..
ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ల విషయంలోనూ వారికి అన్యాయమే జరుగుతోంది. నాటకాలతో పాటు డప్పు వాయిద్యాలు, సన్నాయి రాగాలతో కళల్ని బతికించే కళాకారులు జిల్లాలో 500 మంది వరకూ ఉన్నారు. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 144మంది మాత్రమే ప్రభుత్వ కళాకారుల పింఛన్లు పొందుతున్నారు. గతంలో వృద్ధాప్య పింఛన్లు ఒక్కొక్కరికీ రూ.500 ఉంటే.. కళాకారులకు మాత్రం నెలకు ఒక్కో కళాకారునికి రూ.1,500 ఇచ్చేవి. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్‌తో సమానంగా రూ. 4వేలు మాత్రమే ఇస్తున్నారు. కళల కోసం సర్వస్వం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వృద్ధాప్యంలో మగ్గుతున్న కళాకారులు ఎందరో ఉన్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్ల పంపిణీలో అయినా ప్రభుత్వం కనీస న్యాయం చేయాలని పలువురు కళాకారులు కోరుతున్నారు.
సాంస్కృతిక శాఖకు నిధి ఉండేది..
వినాయక చవితి, ధనుర్మాసాల వంటి పండుగలకు నాటక రంగ కళాకారులు ప్రదర్శనలు వస్తూ బిజీగా ఉండేవారు. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. గతంలో సాంస్కృతిక శాఖకు నిధి ఉండేది. దాని నుంచే గ్రామాల్లో నాటకాల ప్రదర్శనకు కొంత సొమ్ము తీసి కళాకారులను ప్రోత్సహించే వారు. అలాంటి వ్యవస్థ మళ్లీ తీసుకురావాలి. – నెరుసు చింతయ్య,
కళా పోషకుడు,
గుడివాడ
మసకబారుతున్న కళాకారుల జీవితాలు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు జిల్లాలో 500మందికి పైగా కళాకారులు 144మంది కళాకారులకు మాత్రమే పింఛన్లు అది కూడా వృద్ధాప్య పింఛన్లతో సమానంగా అందజేత
వినాయక చవితి, ధనుర్మాసాల వంటి పండుగలకు నాటక రంగ కళాకారులు ప్రదర్శనలు ఇస్తూ బిజీగా ఉండేవారు. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. నాటకాల స్థానంలో చాలా ఇతర షోలు వచ్చేశాయి. గతంలో సాంస్కృతిక శాఖకు నిధి ఉండేది. దాని నుంచే గ్రామాల్లో నాటకాల ప్రదర్శనకు కొంత సొమ్ము తీసి కళాకారులను ప్రోత్సహించే వారు. అలాంటి వ్యవస్థ మళ్లీ తీసుకురావాలి. – నెరుసు చింతయ్య,
కళా పోషకుడు, గుడివాడ
Comments
Please login to add a commentAdd a comment