స్కేటింగ్ పోటీల్లో సుచిత్ర సత్తా
విజయవాడస్పోర్ట్స్: రోలర్ స్కేటింగ్ 62వ జాతీయ పోటీల్లో విజయవాడ క్రీడాకారిణి ఎం.సుచిత్ర సత్తా చాటింది. స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బెంగళూరులో ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించి రోలర్ స్కూటర్ విభాగంలో బంగారు పతకం కై వసం చేసుకుంది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాలలో సుచిత్ర బీసీఏ మొదటి సంవత్స రం చదువుతోంది. ప్రతిష్టాత్మకమైన జాతీయ పోటీల్లో పతకం సాధించిన సుచిత్రను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.కల్పన, కన్వీనర్ శ్రీ లలిత్ ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ మాధవి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.హేమ తదితరులు కళాశాల ప్రాంగణంలో గురువారం అభినందించారు.
కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): పార్లమెంట్‌లో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కించపరిచిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఆయన్ని మంత్ర వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగాగల అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ, దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) విజయవాడ నగర సమితిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, నగర పార్టీ సహాయ కార్యదర్శి నక్కా వీర భద్రరావు, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఖండన..
భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు మద్దిరాల కమలాకరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబేడ్కర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దారుణమని, తక్షణమే ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర యువజన నాయకుడు గోమతోటి వినోద్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment