సూపర్ సిక్స్ .. అట్టర్ ఫ్లాప్
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా.. ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో పాలకులు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. కానీ సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని విమర్శించారు.
వైఎస్సార్ సీపీ హయాంలోనే అభివృద్ధి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తూర్పు నియోజకవర్గం పరిధిలో అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు ఇలా సకల వసతులు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో షాదీఖానా ఏర్పాటు కోసం వైఎస్సార్ సీపీ కృషి చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతులు జారీ చేశారన్నారు. కోటి రూపాయల నిధులతో షాదీఖానా నిర్మాణం చేపట్టామని తెలిపారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే గద్దే చేస్తున్న ప్రతి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు అన్ని వైఎస్సార్ సీపీ హయాంలో జరిగినవేనని స్పష్టం చేశారు.
తోపుడు బండ్లను సైతం..
వైఎస్సార్ సీపీ నాయకులను, సానుభూతి పరులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతో తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ నీచ రాజకీయాలు దిగుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తూర్పు నియోజకవర్గం పరిధిలో అనేక మంది పేదలకు తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు, టిఫిన్ బండ్లు ఇచ్చామన్నారు. ఆ పేదలను సైతం వ్యాపారాలు నిర్వహించకూడదని ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తుండటం దారుణమన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment