కూచిపూడి కళాపీఠంలో ఉత్తరప్రదేశ్ విద్యార్థులు
కూచిపూడి(మొవ్వ): ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులతో కూచిపూడిలో గల శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం గురువారం సందడిగా మారింది. భారత్–శ్రేష్ట్ భారత్‌లో భాగంగా ఐదో విడతగా వచ్చిన 44 మంది విద్యార్థులకు కళాపీఠం ఉప ప్రధానాచార్యుడు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు కళాపీఠంలోని విశేషాలను తెలుసుకున్నారు. కూచిపూడి యక్షగానాలలో పూర్వీకులు వినియోగించిన సంప్రదాయ ఆభరణాలు, నాట్యంలో వినియోగించే హస్త పాదముద్రికలు, నాటి నేటి నాట్యాచార్యుల చిత్రాలను తిలకించారు. నాట్య విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఆంధ్రప్రదేశ్ ఎస్‌పీఏవై డైరెక్టర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ పర్యవేక్షించగా.. నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాయేష్, డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ ధీరజ్(టీం లీడర్), డాక్టర్ రంఘీర్, డాక్టర్ రాధిక గౌర్ విద్యార్థులతో ఉన్నారు.
నష్టపోతున్నాం.. ఆదుకోండి..
పటమట(విజయవాడతూర్పు): పొరుగు రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో పన్నులు అధికంగా ఉండటం వల్ల ఏటా లారీ యజమాని ఒక్కో వాహనానికి రూ.2 లక్షల మేర నష్టపోతున్నారని రాష్ట్ర లారీ యాజమానుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం విజయవాడలోని కృష్ణా జిల్లా లారీ ఓనర్ల సంఘం హాలులో గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ లారీ యజమానులు పక్క రాష్ట్రాల్లో డీజిల్ కొనుగోలు చేయడం వల్ల ఆదాయం కోల్పోతున్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏపీ లారీ ఓనర్స్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గ్రీన్ టాక్స్ తగ్గిస్తామని, కాంపౌండింగ్, చలానా సమస్యలు పరిష్కరిస్తామని కూటమి ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment