వర్గీకరణ చేపడితే సర్కారుకు పతనం తప్పదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మెజారిటీ దళితుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేపడితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పతనం తప్పదని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ హెచ్చరించారు. గురువారం విజయవాడ ధర్నా చౌక్‌లో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, క్రిమీ లేయర్‌కు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వర్గీకరణపై అడుగులు ముందుకు వేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామన్నారు. జాతీయ ఎస్సీ కమిటీ సలహాలు, ఆర్టికల్ 338ను పరిగణనలోకి తీసుకోకుండా వర్గీకరణ కోసం ఏక సభ్య కమిషన్ వేసే అధికారం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. తక్షణమే జీవో 86ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ఆశయాల సాధన, రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణకు వర్గీకరణ, క్రిమీలేయర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కీలక తరుణంలో మౌనం వహిస్తే జాతి భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు వీఎల్ రాజు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్. శ్యాం ప్రసన్నకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి బోడపాటి రమణబాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ల రమేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు పంతగాని సురేష్, డీబీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment