మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): మునిసిపల్ కార్మికుల సమ్మె కాలపు ఒప్పందాలతో పాటు ఇంజినీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సామ్రాజ్యం అధ్యక్షతన గురువారం ఫెడరేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా కార్మికుల సమస్యలకు పరిష్కారానికి నోచుకోవటం లేదన్నారు. ముఖ్యమంత్రి, మునిసిపల్ శాఖ మంత్రి, అధికారులను పలు పర్యాయాలు కలిసి విన్నవించినా ఏమాత్రం సమస్యల పట్ల స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.నూకరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికీ నవంబర్ నెల జీతాలు రాక విశాఖ, ఒంగోలు లాంటి నగరాలలో కార్మికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణిని నిరసిస్తూ ఈ నెల 26న మునిసిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు, జనవరి 3న ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలపై ధర్నాలు, జనవరి 10న మునిసిపల్ కార్యాలయాల వద్ద రిలే దీక్షలు నిర్వహించాలని సమావేశం తీర్మానించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment