దీక్ష విరమణకు సర్వ సన్నద్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై గల శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం మరో అతి పెద్ద ఉత్సవానికి సన్నద్ధమైంది. దసరా ఉత్సవాల తర్వాత అంతటి ఘనంగా, వైభవంగా భవానీ దీక్ష విరమణలు జరుగనున్నాయి. 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్ష విరమణలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5 రోజుల పాటు జరిగే భవానీ దీక్ష విరమణలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒడిశాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, విశాఖపట్నంల నుంచి ఇప్పటికే భవానీలు ఇంద్రకీలాద్రికి పాదయాత్రగా బయలుదేరారు. మొత్తంగా దీక్ష విరమణలకు 6 లక్షల మంది భవానీలు విచ్చేస్తారని అటు దేవస్థానంతో పాటు జిల్లా రెవెన్యూ, పోలీసులు యంత్రాంగం భావిస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రిపై ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్‌కు ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి అఖండ జ్యోతిని తీసుకుని ఊరేగింపుగా మహా మండపం వద్దకు చేరుకుంటారు. మహా మండపం దిగువన, గోశాల వద్ద ఏర్పాటు చేసిన హోమగుండాలలో అగ్నిప్రతిష్టాపన చేసిన అనంతరం దీక్ష విరమణలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అప్పటికే క్యూలైన్‌లో వేచి ఉన్న భవానీలు అమ్మవారిని దర్శించుకుని మహా మండపానికి చేరుకుంటారు. ఇక రాత్రి 11 గంటల వరకు భవానీలకు అమ్మవారి దర్శనం కల్పించేలా దేవస్థానం ఏర్పాటు చేసింది.
25లక్షల లడ్డూలు తయారీ
దీక్ష విరమణలకు 25 లక్షల లడ్డూలను తయారు చేసి భవానీలకు అందించాలని ఆలయ ఈవో కె.ఎస్.రామరావు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రానికి 5 లక్షల లడ్డూలు సిద్ధం అయ్యాయి.
రూట్ మ్యాప్ ఇదే...
దీక్ష విరమణలకు విచ్చేసే భవానీలు దేవస్థానం రూపొందించిన యాప్ ద్వారా సురక్షితంగా తిరుగు ప్రయాణం కావచ్చు. యాప్‌లో స్నానఘాట్ల వివరాలు, గిరి ప్రదక్షిణ మార్గం, క్యూలైన్ ప్రారంభమయ్యే ప్రదేశం, ఇరుముడి సమర్పించే కౌంటర్లు, హోమగుండాలు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వివరాలను అందుబాటులో ఉంచారు. ఇక బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకునే భక్తులు తొలుత వీఎంసీ కార్యాలయం సమీపానికి చేరుకుని తమ లగేజీని కౌంటర్లలో భద్రపరుచుకోవాలి. అక్కడి నుంచి అందుబాటులో ఉన్న సీతమ్మ వారి పాదాలు, పద్మావతి ఘాట్‌లతో పాటు గొల్లపూడి వైపు నుంచి వచ్చే భవానీలకు పున్నమి, భవానీ ఘాట్లు అందుబాటులో ఉన్నాయి. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం దుర్గగుడి ఘాట్‌రోడ్డు వద్దకు చేరుకుని అక్కడి కామధేను అమ్మవారికి నమస్కరించి గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. మొత్తంగా 8 కిలో మీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణలో భవానీలకు అవసరమైన చోట మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాలు, టాయిలెట్స్, విశ్రాంతి ప్రదేశాలను ఏర్పాటు చేశారు. వాతావరణం చల్లగా, చిరు జల్లులు పడుతుండటం.. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భవానీలు ఆలయ ప్రాంగణంలో ఎక్కడా విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోవడం కొంత ఆందోళనకు కారణమవుతోంది.
శనివారం తెల్లవారుజాము నుంచి దీక్ష విరమణలు విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానం 5 రోజుల పాటు విరమణలకు ఏర్పాట్లు 6 లక్షల మంది భవానీలు విచ్చేస్తారని అంచనా
నేటి రాత్రికే నగరానికి భవానీలు
శుక్రవారం సాయంత్రానికే నగరానికి చేరుకునే భవానీలు తొలుత పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. అనంతరం శుక్రవారం రాత్రి నుంచే క్యూలైన్‌లో వేచి ఉండే అవకాశం ఉంది. శనివారం తెల్లవారుజామున దీక్ష విరమణలు ప్రారంభం కావడంతోనే భవానీలు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులను సమర్పించుకునేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇరుముడులను సమర్పించిన వెంటనే మహా మండపం పక్కనే ఉన్న హోమగుండాలలో నేతి కొబ్బరి కాయలను సమర్పించడం, ఆ తర్వాత అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి తిరుగు ప్రయాణంలో లడ్డూ ప్రసాదాలను అందించేలా దేవస్థానం మహా మండపం ఎదుట, కనకదుర్గ నగర్‌లో ఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment