మార్మోగిన దుర్గమ్మ కొండ
● దీక్ష విరమణలకు తరలివస్తున్న భవానీలు
● కొనసాగిన సాధారణ భక్తుల రద్దీ
● అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సాయం వేళ విద్యుత్ దీపకాంతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలిగిపోతుండగా, పగటి వేళ అమ్మవారి నామస్మరణ, భక్తులు, భవానీల రాకపోకలతో ఇంద్రకీలాద్రి పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తోంది. దీక్షలను విరమించేందుకు ఆదివారం పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. శనివారం రాత్రి నగరానికి చేరుకున్న భవానీలు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద కొబ్బరి కాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మార్గం భవానీలతో ఎరుపెక్కింది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భవానీలు 3 గంటల తర్వాత క్యూలైన్‌లోకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని కొండ దిగువనకు చేరుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారి ఆలయం తెరిచి నిత్య పూజలు నిర్వహించిన అనంతరం భవానీలను దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు భవానీలతో క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనం అనంతరం భవానీలు ఇరుముడులు, హోమగుండాలలో నేతి కొబ్బరికాయలను సమర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 60 వేల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. అమ్మవారి లడ్డూల విక్రయాలు ఆదివారం భారీగా జరిగాయి, ఆదివారం ఒక్క రోజే 2.70 లక్షల లడ్డూలను విక్రయించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపున 21 వేల మంది భవానీలు, భక్తులకు అమ్మవారి అన్నప్రసాదాలను అందజేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం, 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భోజనం, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అల్పాహారం అందిస్తున్నారు.
10 గంటల తర్వాత రద్దీ సాధారణం
ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత భవానీల రద్దీ సాధారణంగా ఉండగా, భక్తుల తాకిడి పెరిగింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి కనిపిస్తుంది. అయితే దీక్ష విరమణలలో భవానీల సంఖ్య సాధారణంగా ఉండగా, భక్తుల తాకిడి కొనసాగింది. ఆలయం పరిసరాల్లోని స్కానింగ్ పాయింట్ వరకే క్యూలైన్లు రద్దీ కనిపించింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, భవానీలకు దేవస్థానం అల్పాహారం, అన్నప్రసాదాలను పంపిణీ చేసింది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత భవానీల రద్దీ పెరిగింది.
చిన్నారి మెడలోని బంగారు చైన్ మాయం..
చిత్తూరు నుంచి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఓ కుటుంబంలోని చిన్నారి మెడలో బంగారపు చైన్ మాయమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనానికి వెళ్లే క్రమంలో చిన్నారి మెడలో చైన్ మాయమైనట్లు తల్లిదండ్రులు గుర్తించారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తల్లిదండ్రులను సీసీ కెమెరా రూమ్‌కు తీసుకువెళ్లగా అక్కడ కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదని గుర్తించి, చోరీ వ్యవహారంపై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దుర్గమ్మ సేవలో ప్రముఖులు
కలెక్టర్
పర్యవేక్షణ..
దీక్షవిరమణలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీల రద్దీపై జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దృష్టి సారించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రద్దీని అంచనా వేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరాల ద్వారా, డ్రోన్ విజువల్స్ ద్వారా రద్దీని అంచనా వేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
దుర్గమ్మను ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), సినీ నటుడు ఉపేంద్ర, యూఐ చిత్రబృందంతో అమ్మవారిని దర్శించుకున్నారు. దీక్ష విరమణల నేపథ్యంలో ఏర్పాట్లపై హోం మంత్రి అనిత ఆరా తీశారు. మోడల్ గెస్ట్ హౌస్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన హోం మంత్రికి సీపీ రాజశేఖరబాబు పలు విషయాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment