దుర్గగుడికి నూతన వైదిక కమిటీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీలో కీలక మార్పులు జరిగాయి. ప్రస్తుతం వైదిక కమిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురు అర్చకుల స్థానంలో కొత్త వారిని ఈవో రామరావు నియమించారు. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. నూతన వైదిక కమిటీలో సభ్యులుగా స్థానాచార్య వి. శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్. దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కేఎన్‌వీడీఏం ప్రసాద్, బి. శంకర శాండిల్య, వేద పండిట్ షణ్ముఖ శాస్త్రి, ముఖ్య అర్చక ఆర్. శ్రీనివాసశాస్త్రి, పీవీ రఘునాథ శర్మ, వి. శ్రీధర్‌శర్మ, ఒ.రమేష్‌బాబు ఉన్నారు.
రజకులను
ఎస్సీ జాబితాలో చేర్చాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అన్ని రంగాల్లో వెనుకబడిన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నాడ మోహన్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని తెలంగాణ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ పార్వతి, రాష్ట్ర కార్యదర్శి పోలుగళ్లు కమ్మన్న, కోశాధికారి గుర్రం సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.
చౌక్‌బాల్ రాష్ట్ర జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: చౌక్‌బాల్ రాష్ట్ర జూనియర్ బాల బాలికల జట్లను ఆంధ్రప్రదేశ్ చౌక్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.సుధాకరరావు ఆదివారం ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను జట్లకు ఎంపిక చేశామన్నారు. బాలుర జట్టుకు పార్థు, జగన్, రామ్‌చరణ్, భానుప్రకాష్, జాన్‌రేష్మిక్, హానిజ్‌సాహిల్, సందీప్, సాయికిరణ్, చైతన్య, రాజేష్, గౌతమ్‌రాజ్.. బాలికల జట్టుకు బ్యూల, భాగ్యశ్రీ, సాక్షి, శిరీష, శ్రావణి, షర్మిల, షేక్ బుస్రా, మానస, గీత ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ పోటీలకు ఈ జట్లు ప్రాతినిధ్యం వహిస్తాయని, ఈ జట్లకు కోచ్‌లుగా పి.కావ్యశ్రీ, జి.సురేష్, మేనేజర్‌లుగా కరుణకుమారి, వై.శివాజి వ్యవహరిస్తున్నారని తెలిపారు. జట్లకు ఎంపికై న క్రీడాకారులను రాష్ట్ర సంఘం లీగల్ అడ్వైజర్ పాల కార్తీక్ అభినందించారు.
పవర్ లిఫ్టింగ్ పోటీలు
ప్రారంభం
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) 68వ రాష్ట్ర స్థాయి అండర్–19, అండర్–17 బాల, బాలికల పవర్ లిఫ్టింగ్ పోటీలు కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, కృష్ణాజిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలను ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి(డీఐఈవో) సీఎస్‌ఎస్‌ఎన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి, ఎస్‌జీఎఫ్ కృష్ణాజిల్లా అండర్–19 కార్యదర్శి వి.రవికాంత తెలిపారు. రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్–17 కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, టోర్నీ అబ్జర్వర్ గంటా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment