మెరుగైన సంక్షేమంటే భారాలు మోపడమేనా బాబూ?
మాజీఎమ్మెల్యే మల్లాది విష్ణు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే తాము ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం..నేడు నిత్యావసర ధరలు..విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలపై తీవ్రభారాన్ని మోపడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. మెరుగైన సంక్షేమం అంటే అన్నిరకాల చార్జీలు పెంచడమేనా చంద్రబాబు అని నిలదీశారు. సింగ్‌నగర్‌లోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీల కారణంగా రాష్ట్ర ప్రజలపై రూ.15వేల కోట్ల భారం పడుతోందన్నారు. బుడమేరు వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. జీఎస్టీ కట్టే వారి దగ్గర నుంచి 1శాతం వసూళ్లకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే ఈ ప్రభుత్వ బాదుడే బాదుడు ఏవిధంగా ఉందో ప్రజలందరికి అర్థమవుతుందన్నారు. నిత్యవసర సరుకులు, రిజిస్ట్రేషన్ చార్జీలు, మంచినీటి, యూజీడీ మెయింటినెన్స్‌పై కూడా యూజర్ ఛార్జీలు వేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకోవడం దౌర్భాగ్యమని మండిప్డారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇలా అధిక భారాలను మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన ‘వైఎస్సార్ సీపీ పోరుబాట’ కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ధర్నా చౌక్‌లో ఆరోజు ఉదయం 9 గంటలకు నిరసన చేపట్టి అక్కడి నుంచి ట్రాన్స్‌కో ఎస్‌ఈ, డీఈ, ఏఈ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రాలు అందజేస్తామని వివరించారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలంతా హాజరుకావాలన్నారు. అనంతరం 27న తలపెట్టిన ‘వైఎస్సార్‌సీపీ పోరుబాట’ పోస్టర్‌ను డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు సుందర్‌పాల్, అలంపూరు విజయ్, ఇసరపు రాజు, యరగొర్ల శ్రీరాములు, బత్తుల దుర్గారావు, ఎండి ఇస్మాయిల్ , కాళ్ల ఆదినారాయణ,ప్రేమ్, కేబుల్ ప్రవీణ్, లాయర్ కొండలరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment