అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు డిమాండ్
మధురానగర్(విజయవాడసెంట్రల్): తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ అధ్యయన కేంద్రం సిబ్బంది, ఉద్యోగులు కోరారు. విజయవాడ మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ రీజనల్ సెంటర్ వద్ద అధ్యయన కేంద్రం సిబ్బంది, ఉద్యోగులు మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ అధ్యయన కేంద్ర ఉద్యోగులు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశాలను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా అధ్యాపక సహాయ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు అందడం లేదన్నారు. రాష్ట్రంపై తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల నుంచి వసూలయ్యే ఫీజుల మొత్తం రూ.21 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ నిధులను వారి వద్ద ఉంచుకుని తమకు జీతాలు ఇవ్వడం లేదని, విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అవశ్యకతను గుర్తించి రాష్ట్రంలో దీనిని ఏర్పాటుకు కృషిచేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో అధ్యయన కేంద్రం డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.అజంతకుమార్, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment