పాలకుల విధానాలతో ఇబ్బందుల్లో కార్మికులు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆటో, మోటార్ వాహనాలకు లైసెన్సులు బ్రేక్ చేసే విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె .దుర్గారావు డిమాండ్ చేశారు. బీఆర్‌టీఎస్ రోడ్డులోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రైల్వేస్టేషన్ పార్సిల్ ఆఫీస్ ఆటోస్టాండ్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఆటో, మోటార్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కుట్రపూరితంగా ఉన్న కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాల్సిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వాటిని అమలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న నిర్వహించే నిరసన కార్యక్రమంలో ఆటో, మోటార్ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం. హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె దుర్గావళి, తూర్పు సిటీ కార్యదర్శి బి. రూబేన్ కుమార్, పశ్చిమ సిటీ కార్యదర్శి ఎస్. డి కరిముల్లా, నగర నాయకులు డి. కోటయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైల్వేస్టేషన్ పార్సిల్ ఆఫీస్ ఆటోస్టాండ్‌కు 18 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా పి. తిరుపతయ్య, ఎం. కొండలరావు, కోశాధికారిగా బి.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.
హైందవ శంఖారావం మహాసభకు తరలిరండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం వద్దనున్న కేసరపల్లిలో జనవరి ఐదోతేదీన నిర్వహించనున్న హైందవ శంఖారావం మహాసభకు రాజకీయపార్టీలు, కులాలకతీతంగా అందరూ తరలిరావాలని వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో హైందవ శంఖారావం సభ వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం మహాసభకు అందరూ మద్దతు తెలియజేయాలని కోరారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేవరకు ప్రతి హిందువు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాల వెంకటేశ్వర్లు, కనకపర్తి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment