కూటమిలో భగ్గుమన్న విభేదాలు
రామవరప్పాడు: జనసేన నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ జెండా దిమ్మెను టీడీపీ నేతలు ధ్వంసం చేయడం తీవ్ర దుమారం రేపింది. కృష్ణాజిల్లా రామవరప్పాడులోని రాజుల బజారు పంచాయతీ కార్యాలయం పక్కవీధిలో జనసేన గ్రామ అధ్యక్షుడు రత్నం నాగేశ్వరరావు సోమవారం రాత్రి ఆ పార్టీ దిమ్మెను ఏర్పాటు చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ నాయకుడు కొంగన రవి తనవర్గీయులతో కలిసి ఆ దిమ్మెను ధ్వంసం చేశారు. దీంతో జనసేన, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈవిషయంలో పటమట పోలీసులు జోక్యం చేసుకుని దిమ్మె నిర్మించిన వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో జనసేన శ్రేణులు కూడా స్టేషన్‌కు వెళ్లి ఆందోళన చేశాయి. ఈసందర్భంగా రత్నం నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము జెండా దిమ్మె ఏర్పాటు చేసిన కొద్దిదూరంలోనే టీడీపీ పార్టీ దిమ్మె కూడా ఉందన్నారు. తాము ప్రారంభించబోతున్న పార్టీ కార్యాలయ సమీపంలో జెండా దిమ్మె ఏర్పాటు చేసుకుంటుంటే టీడీపీ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. వారి అనుచిత ప్రవర్తనపై తమపార్టీ నాయకులైన ఎంపీ బాలశౌరి, ఉదయభాను, వేదవ్యాస్, వంగవీటి రాధాకృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును కూడా కలిసి టీడీపీ నేతల తీరుపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment