గుట్టుగా ఇసుక తవ్వకాలు
పెనమలూరు: కాసుల కోసం టీడీపీ నాయకులు గుట్టుగా ఇసక తవ్వకాలు చేపట్టారు. మండలంలోని చోడవరం, యనమలకుదురు గ్రామాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా చోడవరం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలు ఉపయోగించి ఇసుక తవ్వకలు జరపడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా నిలిచిపోయిన ఇసుక తవ్వకాలను టీడీపీ నేతలు మళ్లీ ప్రారంభించారు. చోడ వరం శివారు ప్రాంతంలో కృష్ణా నదిలో ఎవరికీ కనిపించకుండా చెట్ల చాటున పొక్లెయిన్‌తో బుధవారం ఇసుక తవ్వకాలు చేపట్టారు. భారీగా ట్రాక్టర్లను తీసుకొచ్చి టన్నుల కొద్దీ ఇసుక అక్రమంగా తరలి స్తున్నారు. చోడవరం ఇసుక క్వారీలో లోడింగ్ చేసే కూలీలు వ్యవసాయ పనులకు రావటంలేదని పెత్తందారులు కొద్ది రోజుల క్రితం ఇసుక తవ్వకాలను ఆపారు. తాజాగా కూలీలతో నిమిత్తం లేకుండా పొక్లెయిన్‌తో తవ్వకాలు చేపట్టారు. దీంతో భూగర్భ జలాలకు సమస్య తెచ్చేలా, నిషేధం ఉన్న రీచ్‌లో ఇసక తవ్వకాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలు కాసుల కోసం దారుణంగా దిగజారిపోయారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
యనమలకుదురులో...
యనమలకుదురులో కూడా నిషేధ క్వారీ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. కృష్ణానది ఘాట్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు చేసి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. క్వారీలో బుధవారం ఉదయం బాహాటంగానే ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తామని ప్రకటనలు చేస్తున్నా బహిరంగ మార్కెట్‌లో ట్రాక్టర్ ఇసుక రూ.4 వేల నుంచి రూ.4.5 వేలకు విక్రయిస్తున్నారు. టీడీపీ నేతలు కాసుల కోసం బరితెగించారని ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment