క్రీస్తు మార్గం అనుసరణీయం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. బైబిల్ గ్రంథం మానవాళికి అందించిన ప్రవచనాలు మంచి మార్గాన్ని, అద్భుత జీవితాన్ని గడిపేందుకు, శాంతియుత సమాజ స్థాపనకు దోహదపడతాయని పేర్కొన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని సెయింట్ పాల్స్ బాసిలికా సీఎస్‌ఐ చర్చిలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. క్రీస్తు విశ్వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. కరుణామయుడు క్రీస్తు చూపించిన ప్రేమ, సహనం, ఓర్పు నేటి సమాజానికి అవసరమన్నారు. తన సిలువకు కారణమైన వారిని, పాపులను సైతం క్షమించగలిగిన ఉదాత్త హృదయం కలిగిన ఏసుక్రీస్తును ఆరాధించడమే కాకుండా ఆయన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. తనను తాను తగ్గించుకున్న వారు దేవుడి మనసులో హెచ్చింపబడతారని, నిన్ను వలె నీ పొరుగు వారిని సైతం ప్రేమించాలి అన్న బైబిల్ వాఖ్యాలను లక్ష్మీశ చదివి వినిపించారు. క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సక్రమంగా వినియోగించుకుని విద్య, ఉపాధి రంగాలలో అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఎంతో మంది క్రైస్తవ ప్రార్థన మంది రాల నిర్వాహకులు విద్యా రంగానికి ఎంతో సేవ చేస్తున్నారని అభినందించారు. అట్టడుగు వర్గాల వారికి వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నారని ప్రశంసించారు. కర్ణాటక రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ (కర్ణాటక) అదనపు కార్యదర్శి కొర్లపాటి హెప్సీబా రాణి మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాల సేవలను ప్రతి పేదవాడికి అందించేందుకు చర్చిల నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో సీఎస్‌ఐ కృష్ణా–గోదావరి డయాసిస్ బిషప్ టి.జార్జ్ కార్నెలియస్, చర్చి పాస్టర్లు టి.డానియల్ దిలీప్, రెవరెండ్ జి.వాగ్దాన బాబు, కె.రోనాల్డ్, చర్చి కార్యదర్శి ఎం.ఏలియా, కోశాధికారి పి.అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment