కొల్లూరు: పోలీసు శాఖలో ఆర్‌ఎస్‌ఐగా పని చేస్తున్నానని నమ్మబలికి ఓ మహిళను మోసగించి వివాహం చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల వివాహానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ వ్యక్తి తాను ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నానని నమ్మబలికాడు. అనంతరం పరిచయం పెరగడంతో ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు గమనించిన సదరు యువతి బంధువులు ఆరా తీశారు. అతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మేడి పల్లి పృథ్వీరాజ్ చౌదరిగా చెప్పుకొన్న అతడి అసలు పేరు మేడిపల్లి వెంకటేశ్వరరావు అని, ఊరు కృష్ణా జిల్లా నాగాయిలంక మండలం గణపేశ్వరం అని తేలింది. ఇప్పటికే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. దీంతో బాధితురాలు మంగళవారం అతడిపై కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సోదరి పిల్లలకు సైతం ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు గుంజినట్లు పోలీసుల వద్ద ఆమె, బంధువులు వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొల్లూరు ఎస్‌ఐ జి.ఏడుకొండలు తెలిపారు.
నిందితుడికి ఇప్పటికే పెళ్లయి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న వైనం బాధితురాలి ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment