కళ్లకు గంతలు
రోడ్లపై గుంతలు..
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. అడుగుకో గుంతతో నిండిన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ రహదారులపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు శాపంగా మారాయి. గతంలో కురిసిన అధిక వర్షాల కారణంగా భారీ వరదలు వచ్చాయి. వరదల్లో అనేక రోడ్లు కోతకుగురవగా, పలు రహదారులు ధ్వంసమయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదు. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో 200లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేపట్టేందుకు నిధులు కావాలని ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అరకొరగా మాత్రమే నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే వీటిని నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలనే లక్ష్యం ప్రశ్నార్థ కంగా మారింది.
70 రోడ్ల మరమ్మతులకు ప్రణాళికలు
జిల్లాలోని మరో 70 రోడ్ల మరమ్మతులకు ప్రణాళికలు తయారు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గానికి పది రోడ్ల చొప్పున ఎంపిక చేసి, వాటిని కావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరుతూ నివేదికలు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలోని జిల్లాలోని 149 రోడ్లలోని గుంతలు పూడ్చేందుకు రూ.54.27 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరయితే 569 కిలో మీటర్ల మేరకు రోడ్ల పనులు చేపడతారు.
భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లు జిల్లాలో 200కు పైగా రోడ్లలో గుంతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు 45 రోడ్లలో గుంతలు పూడ్చేందుకు రూ.14 కోట్ల మంజూరు వాటిలో 37 మాత్రమే ప్రారంభం.. 16 రోడ్ల పనులు పూర్తి మిగిలినవి సంక్రాంతికి పూర్తి చేయాలన్న లక్ష్యం అనుమానమే 149 రోడ్ల పనులకు రూ.54.26 కోట్లతో ప్రతిపాదనలు
నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు ఇలా
సంక్రాంతికి పూర్తయ్యేనా?
జిల్లాలోని 45 రోడ్లపై ఏర్పడిన గుంత లను పూడ్చేందుకు ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. 239 కిలో మీటర్ల పొడవున ఉన్న ఈ రోడ్ల మరమ్మతుల కాంట్రాక్టులు అధికార పార్టీ నేతలు సిఫార్సులు ఉన్న వారికే దక్కాయి. అయితే, వీటిని సంక్రాంతికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు 37 రోడ్ల మరమ్మతులు మాత్రమే ప్రారంభమయ్యాయి. వాటిలో కేవలం 16 మాత్రమే పూర్తయ్యాయి. మిగి లిన రోడ్ల పనులను పనులు సంక్రాంతి పండుగ లోపు పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరడం అనుమానంగానే ఉందని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులే పేర్కొంటున్నారు.
సంక్రాంతిలోపు పూర్తికి చర్యలు
జిల్లాలో గుంతలతో నిండిన 45 రోడ్ల మరమ్మతులు పనులు చేపట్టేందుకు రూ.14 కోట్లు మంజూరుయ్యాయి. 239 కిలో మీటర్ల పొడవున ఉన్న రోడ్లపై గుంతలను పూడ్చేందుకు చర్యలు చేపట్టాం. వీటిని సంక్రాంతిలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. మరో 149 రోడ్లకు రూ.54.26 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించాం.
– లోకేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ, కృష్ణా జిల్లా
నిధులు మంజూరు చేయాలి
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ రోడ్లపై ప్రయాణం కష్టంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్ అండ్ బీ రోడ్లలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినా పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం సరికాదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, రోడ్ల మరమ్మతులకు కావాల్సిన నిధులు మంజూరు చేసి, పనులను పూర్తి చేయాలి. – టి.తాతయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment