నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి మచిలీపట్నంకు చెందిన భక్తులు శుక్రవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. మచిలీపట్నంకు చెందిన డొక్కు కృష్ణ డిటెక్టివ్, భారతీదేవి దంపతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఇన్‌చార్జి ఈవో రామచంద్రమోహన్‌ను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, అధికారులు దుర్గమ్మ చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
నేటి నుంచి నవదిన ప్రార్థనలు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం పెద అవుటపల్లిలో బ్రదర్ జోసఫ్ తంబి 80వ వర్ధంతి మహోత్సవాలు పురస్కరించుకుని ఈ నెల 4నుంచి నవదిన ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తంబి పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ జోసఫ్ పాలడుగు తెలిపారు. స్థానిక విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మహోత్సవాలకు భక్తులను ఆధ్యాత్మికంగా సిద్ధం చేయడానికి సాయంత్రం 5.30 గంటల నుంచి జపమాల, దివ్యబలిపూజలు జరుగుతాయని చెప్పారు. విజయవాడ మేత్రాసనం, వికార్ ఫోరిన్ గన్నవరం విచారణ ఫాదర్ పసల థామస్ మహోత్సవాల పతాకవిష్కరణ చేసిన తర్వాత నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
కొండలమ్మకు రూ.22.16 లక్షల ఆదాయం
గుడ్లవల్లేరు: కొండలమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు వేసిన కానుకలను తనిఖీ అధికారి కగ్గా శ్రీనివాసరావు సమక్షంలో శుక్రవారం లెక్కించారు. 57రోజులకు రూ.22,16,117 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఆకుల కొండలరావు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
యువ పారిశ్రామికవేత్తలకు చేయూత
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి యువ పారిశ్రామిక వేత్తలకు చేయూత నివ్వాలని సంకల్పించినట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఆధ్వర్యాన లబ్బీపేటలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న రోటా ఫెయిర్‌ను శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో పలు సంస్థలు ప్రదర్శించిన వస్తువులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. రోటరీ మిడ్‌టౌన్ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్‌బాబు మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఫెయిర్‌లో పదివేల మంది సందర్శకులు సందర్శించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఫెయిర్ ద్వారా వచ్చే నగదును పోలియో నిర్మూలనకు వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రోటా ఫెయిర్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్లు చిన్నం మధుబాబు, అమూల్య శ్రీనివాస్, క్యూనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆనందరెడ్డి, క్లబ్ కార్యదర్శి బత్తుల ప్రతాప్‌రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment