అభ్యుదయ సాహిత్యానికి ఎదురులేని ఎర్రజెండా శ్రీశ్రీ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అభ్యుదయమైనా, విప్లవ కవిత్వమైనా ఎదురులేకుండా ఎగిరిన ఎర్రజెండా శ్రీశ్రీ అని ప్రముఖ కవి, రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కావ్యం 75 వసంతాల ఉత్సవం శనివారం ప్రధాన వేదికపై జరిగింది. ఈ కార్యక్రయానికి ప్రధానవక్తగా హాజరైన అప్పలనాయుడు మాట్లాడుతూ.. సమాజోద్ధరణే కళలు, సాహిత్యం లక్ష్యం కావాలని నమ్మిన కవి శ్రీశ్రీ అని కొనియాడారు. సమాజంలో ఉన్న కష్ట జీవులను మాత్రమే మనుషులుగా పరిగణించడం శ్రీశ్రీ ఘనతగా పేర్కొన్నారు. ఆయన చేపట్టిన అన్ని రకాల సాహిత్య ప్రక్రియల్లోనూ తనదైన గుర్తింపు సాధించారని వివరించారు. నిర్భ యంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రినీ ఎదిరించిన శ్రీశ్రీ లక్షలాదిమంది యువకులు వామపక్ష ఉద్యమంలోకి మారడానికి కారణమయ్యారని పేర్కొన్నారు. స్పష్టమైన రాజకీయ ఉద్దేశాలు ఉండి వాటిని ధైర్యంగా ప్రకటించిన ధీరుడని వివరించారు. రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి మాట్లాడుతూ.. మహాప్రస్థానం కవితలు తుపాకీలో తూటాల్లో హృదయాల్లోకి దూసుకుపోతాయన్నారు. శ్రీశ్రీ మాటల్లోనే తప్ప ఆయన కవిత్వాన్ని గురించి వివరించలేమన్నారు. మహాప్రస్థానం, దానికి చలం రాసిన ముందుమాట మానవులు ఉన్నంత కాలం ఉంటుందన్నారు. శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. 1938లో శ్రీశ్రీ మహాప్రస్థానం రచనను పూర్తి చేశారన్నారు. 1940లో దానికి చలం ముందు మాట రాశారని గుర్తుచేశారు. అయితే కొన్ని కారణాలతో పదేళ్ల తరువాత 1950 జూన్‌లో అది పుస్తక రూపంలోకి వచ్చిందన్నారు. శ్రీశ్రీ సాహిత్యనిధి బాధ్యుడు అశోక్ కుమార్ శ్రీశ్రీ గురించి ప్రచురించిన మూడు పుస్తకాలను సభలో ఆవిష్కరించారు. పుస్తక మహోత్సవం అధ్యక్షుడు కె.లక్ష్మయ్య, సాహితీవేత్త గోళ్ల నారాయణరావు సభలో ప్రసంగించారు. సొసైటీ కార్యదర్శి మనోహర్ నాయుడు సభను నిర్వహించారు.
సామ్రాజ్య వాదానికి ప్రతిఘటన పెరిగింది
అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రపంచ వ్యాపి తంగా పెద్ద ఎత్తున నేడు ప్రతిఘటన పెరిగిందని ప్రజాశక్తి బుక్ హౌస్ పూర్వ సంపాదకుడు ఎస్.వెంకట్రావు అన్నారు. ప్రముఖ విశ్లేషకుడు డి.పాపారావు రచించిన ‘మానవాళికి మహో దయం.. అంతం కాదిది ఆరంభం’ పుస్తకావిష్కరణ సభ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రాంగ ణంలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎస్. వెంకట్రావు ఆవిష్కరించి ప్రసంగించారు. అమెరికా ఎంత పెద్ద ఎత్తున తన సామ్రాజ్య వాదాన్ని ప్రపంచంపైకి తీసుకెళ్తుందో అదే స్థాయిలో వ్యతిరేకత పెరిగిందన్నారు. చైనా వంటి దేశాలు చాలా బలంగా అమెరికాను వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా నేడు కాగితపు పులిగా మారిందని ఎద్దేవా చేశారు. ఇటువంటి అనేక అంశాలను రచయిత తన పుస్తకంలో చక్కగా వివరించారని పేర్కొన్నారు. రచయిత పాపారావు మాట్లాడుతూ.. అమెరికా ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో గొప్ప స్థాయిలో ఉండేద న్నారు. నేడు ఏఐ వచ్చిన తరువాత పూర్తిగా తిరోగమన దశలో ఆ దేశం సాగుతోందని పేర్కొన్నారు. నేడు అమెరికాలోని మితవాదులు ఆ దేశ పతనం గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇది ప్రపంచ దేశాలకు చాలా మంచి పరిణామమని వివరించారు. ఈ సభకు రచయిత బి.సాంబశివరావు అధ్యక్షత వహించారు.
Comments
Please login to add a commentAdd a comment