దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ మంత్రి ఆనం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ మంత్రి ఆనం

Published Sun, Jan 5 2025 1:41 AM | Last Updated on Sun, Jan 5 2025 1:41 AM

దుర్గ

దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ మంత్రి ఆనం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామచంద్ర మోహన్‌, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం మంత్రికి పండితులు వేద ఆశీర్వచనం, ఈఓ, డీఈఓ రత్నరాజు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ఈఓ చాంబర్‌లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆలయ ఈఓ, డీఈఓ, ఈఈలతో పాటు ఏఈఓలతో సమావేశం నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రోజువారీ జరిగే అర్జిత సేవలు, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాద పూర్వకంగా మసులుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అందరూ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సుతో ఉల్లాసంగా జీవించాలని దుర్గమ్మను ప్రార్థించానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై దృష్టి సారించామన్నారు.

హైందవ శంఖారావం సభకు పటిష్ట భద్రత

గన్నవరం: మండలంలోని కేసరపల్లిలో ఆదివారం జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభ ప్రాంగణాన్ని ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు, సిబ్బందితో సమావేశమైన ఆయన భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ బహిరంగ సభకు సుమారు మూడు లక్షల మంది జనం వస్తున్న నేపథ్యంలో భద్రత పరంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ బహిరంగ సభ మతపరమైనది కావడంతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించాలని, సభ ముగిసిన తర్వాత, చివరి వాహనం వెళ్లే వరకు ట్రాఫిక్‌ సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు మాట్లా డుతూ.. ఈ బహిరంగ సభ కోసం సుమారు మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. డీఎస్పీ సిహెచ్‌.శ్రీనివాసరావు, సీఐలు బి.వి.శివప్రసాద్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా వర్సిటీ

వాలీబాల్‌ జట్టు ఎంపిక

విజయవాడస్పోర్ట్స్‌: దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల వాలీబాల్‌ మహిళల పోటీలకు ప్రాతినిధ్యం వహించే కృష్ణా యూనివర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.కల్పన తెలిపారు. తమ కాలేజీ ఆధ్వర్యంలో ఇటీవల ఎంపిక పోటీల్లో అంత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన ఎస్‌.సంజన, అంకిత, దివ్య, దీవెన, సుప్రియ, మేఘన, హారిక, సీత, సుధారాణి, జయ, ప్రశాంతి, భువనేశ్వరి, తనుశ్రీ, దీపిక జట్టుకు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ జట్టుకు కోచ్‌, మేనేజర్‌గా కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.హేమ వ్యవహరిస్తారని, ఈ నెల ఏడు నుంచి 11వ తేదీ వరకు చైన్నెలోని జెప్పియార్‌ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని తెలిపారు. జట్టు బృందాన్ని కళాశాల ప్రాంగణంలో కళాశాల కన్వీనర్‌ లలితప్రసాద్‌, ప్రత్యేక అధికారి డాక్టర్‌ ఆర్‌.మాధవి అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దుర్గమ్మ సేవలో               దేవదాయ శాఖ మంత్రి ఆనం
1
1/1

దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ మంత్రి ఆనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement