విద్యావ్యవస్థ అభివృద్ధికి సంస్కరణలు
పాయకాపురం(విజయవాడరూరల్): ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేసేందుకు సంస్కరణలను అమలు చేస్తున్నామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులం మార్పు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, అధికారులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని లోకేష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితాన్ని ఓ పరీక్షగా భావించి, శ్రమించి ఉన్నత విజయాలు అందుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో జాబ్‌మేళాలు మినహా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
భావి జీవితానికి ఇంటర్ ప్రధాన వంతెన
విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియెట్ దశ చాలా ముఖ్యమైనదని, జూనియర్ కళాశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ తెలి పారు. డ్రగ్స్ నియంత్రణకు కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పాయకా పురం జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావ్, ఉన్నతాధికారులతో కలిసి మంత్రి లోకేష్ భోజనం చేశారు. కార్యక్రమంలో ఇంటర్మీడియెట్ విద్య డైరెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నారా లోకేష్
Comments
Please login to add a commentAdd a comment