పని చేయించుకొని పైసా విదల్చలేదు
వరదల్లో పని చేసిన డ్వాక్రా సంఘాలకు అందని నగదు
ఇబ్రహీంపట్నం: గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరద ముంపు బాధితుల సహాయార్థం ఆహార ప్యాకెట్లు ప్యాకింగ్ చేసిన డబ్బుల కోసం పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు ఎదురుచూస్తున్నారు. కృష్ణానదికి వరద పోటెత్తడంతో పాటు బుడమేరు కట్టలు తెగి విజయవాడలోని పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు ఆహారం అందించేందుకు మండలానికి చెందిన పలువురు డ్వాక్రా సంఘాల సభ్యులను ఆహారం ప్యాకింగ్ చేసినందుకు రోజుకు పగటి పూట రూ.700, రాత్రి వేళ రూ.900 చొప్పున చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. వెలుగు కార్యాలయం అధికారులు కార్యాలయం సీసీల ద్వారా వారం రోజుల పాటు సుమారు 400 మందిని గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు తరలించి ప్యాకింగ్ పనులు చేయించారు. పని చేసి 5 నెలలు గడుస్తున్నా ప్యాకింగ్ చేసిన డబ్బులు చెల్లించలేదని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ చెప్పినా ప్రయోజనం లేదని, నిద్రాహారాలు మాని పడిన కష్టానికి ప్రతిఫలం దక్కలేదని తెలిపారు. ఉన్నతాధికారులు తమ కష్టాన్ని గుర్తించి డబ్బులు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై మండల వెలుగు ఏపీఎం శోభన్‌బాబును వివరణ కోరగా మూడు రోజులు పని చేసిన వారి కూలీలు చెల్లించామన్నారు. మరికొంతమందికి నగదు రావాల్సి ఉందన్నారు. నగదు చెల్లింపు అంశం జిల్లా అధికారుల దృష్టిలో పెట్టామన్నారు. నిధులు విడుదల అయిన వెంటనే బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment