కృష్ణానదిలో యువకుడి గల్లంతు
తాడేపల్లి రూరల్ : కృష్ణానదిలో ఓ యువకుడు ఆదివారం గల్లంతయ్యాడు. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా భీమునిపట్నం, నేరెళ్లవలసకు చెందిన చాట్ల బాలు (18) కుటుంబం విజయవాడకు వచ్చి కూలీ పనులు చేసుకుంటోంది. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో ఈతకని వచ్చి నీటిలోకి దిగారు. బాలు మునిగిపోవడంతో స్నేహితులు కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వెతికినా ప్రయోజనం కనిపించలేదు. తాడేపల్లి పోలీసులు, మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అతడి బంధువులు, స్నేహితులు నది వద్దకు వచ్చి బాలు ఆచూకీ కోసం ఎదురు చూశారు.
పంటకాలువలో
మృతదేహం
కోడూరు: అవనిగడ్డ, కోడూరు ప్రధాన పంటకాలువలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ చాణిక్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మాచవరం సమీపంలో పంటకాలువలో మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించి, స్టేషన్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించినట్లు ఆయన చెప్పారు. మృతదేహం రెండు చేతులు, పొట్ట, మెడ భాగాల్లో పచ్చబొట్లు ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి శరీరంపై వైట్ కాలర్ ఫుల్‌హ్యాండ్స్ చెక్స్ షర్టు, మెరూన్ కలర్ బ్లూ జీన్స్ ప్యాంట్ ఉన్నాయన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు స్థానిక పీఎస్‌లో సమాచారమివ్వాలని ఎస్‌ఐ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment