వైభవంగా పేరంటాలమ్మ తెప్పోత్సవం
ముగిసిన సంక్రాంతి సంబరాలు
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ ఆలయంలో వారం రోజులుగా జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఆరు రోజులుగా రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో అమ్మవారి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రసాదంపాడులో రథోత్సవం ముగిసిన తర్వాత ఆలయం ఎదుట ఉత్సవ విగ్రహాలు చేరుకున్నాయి.
కనుల పండువగా..
గ్రామంలో వంతెన సమీపంలోని రైవస్ కాలువలో హంస ఆకారంలో ప్రత్యేకంగా అలంకరించిన పడవలో అమ్మవార్లను ఉంచి తెప్పోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం సమీపంలోని రావిచెట్టు ఎదుట వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఊయలలో అమ్మవార్లను ఉంచి పూలంగి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ముగ్గురమ్మలను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆలయ ఈఓ ప్రియాంక మాట్లాడుతూ ఉత్సవాలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హుండీల ఆదాయం రూ. 12,23,605
ఆలయంలో నిర్వహించిన సంక్రాంతి జాతర మహోత్సవాల సందర్భంగా గ్రామోత్సవ వాహనంలో ఏర్పాటు చేసిన అమ్మవార్ల రథోత్సవ హుండీలు, భక్తులు సమర్పించిన నగదు దండల కానుకల ద్వారా రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో కలిపి అమ్మవార్లకు రూ.12,23,605 ఆదాయం వచ్చినట్లు ఈవో ప్రియాంక తెలిపారు. రామవరప్పాడు ప్రధాన గ్రామంలో రూ.4,21,781 కానుకలు లభించాయి. కాల్వగట్టు ప్రాంతం పీఎస్‌ఆర్ కాలనీలో రూ.3,99,495 కానుకలు భక్తులు సమర్పించారు. ప్రసాదంపాడులో రూ.4,02,329 కానుకలను భక్తులు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment