మొక్కుబడిగా..
లబ్బీపేట(విజయవాడతూర్పు): మలేరియా నిర్మూలన కార్యక్రమాలు నగరంలో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రభుత్వ కార్యక్రమాలను సైతం తూతూమంత్రంగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇలా నగరంలోని మలేరియా విభాగం.. నిర్వీర్యంగా మారింది. అక్కడ పనిచేసే సిబ్బంది ఎప్పుడు వస్తారో, వెళ్తారో కూడా తెలియని దుస్థితి నెలకొంది. వారి పరిధిలోని ఏదో ఒక ప్రాంతానికి వచ్చి ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేయడం, ఆ తర్వాత సొంత పనులు చూసుకుంటున్నారు. మరోవైపు మలేరియాలో అవినీతి కూడా అధికమైంది. పర్యవేక్షణ కొరవడమే కారణంగా చెబుతున్నారు.
ప్రభుత్వం ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహిస్తోంది. అందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, మలేరియా సిబ్బంది తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. నీరు ఎక్కడైనా నిల్వ ఉందా, శానిటేషన్ సమస్య ఏమైనా ఉందా అనే వాటిని గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ సిబ్బంది ఏదో ఒక ప్రాంతంలో నాలుగైదు ఇళ్లు సందర్శించి కావాల్సిన ఫొటోలు దిగి యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో కార్యక్రమం ముగిసిపోతుంది. అసలు ఎన్ని ఇళ్లు సందర్శించారు. జ్వరాలతో ఎవరైనా బాధపడుతున్నారా, ఇళ్లలో నీరు నిల్వ ఉన్నాయా అనే వాటిని గుర్తించడం వంటి కార్యక్రమాలను ఎప్పుడో మర్చిపోయారు. అంతేకాదు మలేరియా.. ఇంటింటి సర్వే కూడా జరగడం లేదు. మలేరియా పాజిటివ్ కేసులు వస్తునసిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మలేరియా విభాగంలో అవినీతి సైతం పెద్ద ఎత్తున జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల ఎస్‌ఆర్‌లు అన్నీ మచిలీపట్నంలో ఉంటాయి. అక్కడ పనిచేసే కార్యాలయ సిబ్బంది ఏ పనిచేయాలన్నా, డబ్బులు చెల్లించాల్సిందే. ఎన్టీఆర్‌జిల్లాకు సంబంధించిన నిధులు ఇవ్వాలన్నా పర్సంటేజీలు చెల్లించుకోవాల్సిందే. నాలుగు నెలల క్రితం మలేరియా ఉద్యోగి మరణించగా, అతని రావాల్సిన బెనిఫిట్స్, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధం చేయాల్సిన ఫైల్స్‌కు సైతం పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇలా ప్రతి పనికి లంచం లేనిదే పనులు జరగని పరిస్థితి నెలకొంది.
మలేరియాలోని వివిధ కేడర్ల సిబ్బంది వీఐపీల్లా సబ్‌యూనిట్‌లకు వచ్చి వెళ్తుంటారు. తమకు కేటాయించిన పరిధిలో ఎఫ్‌ఆర్‌ఎస్‌లో అటెండెన్స్ నమోదు చేస్తారు. అనంతరం తమ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. రోజులో వారికి తీరిక ఉన్న సమయంలో సబ్‌యూనిట్‌కు వచ్చి సంతకం చేస్తుంటారు. మలేరియా ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు పట్టించుకునే వారే లేరు. అంతేకాదు ఒక ఉద్యోగి ఏకంగా సెలవు పెట్టకుండానే విహార యాత్రలకు వెళ్లి వచ్చినట్లు సహచర ఉద్యోగులే చెబుతున్నారు.
● నగరంలో మలేరియా సబ్ యూనిట్లు ఆరు ఉన్నాయి. వీటిలో సబ్‌యూనిట్ ఆఫీసర్లు ఆరుగురు ఉన్నారు. ఎంపీహెచ్‌ఎస్‌లు 24 మంది పని చేస్తున్నారు. ఎంపీహెచ్‌ఏలు 53 మంది పని చేస్తున్నారు. ఇలా మొత్తం మీద చూస్తే 97 మంది సిబ్బంది మలేరియా విభాగంలో ఉన్నారు.
మలేరియా విభాగంలో సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు పూర్తిస్థాయి మలేరియా అధికారి లేరు. దీంతో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డీఎంఓగా వ్యవహరిస్తున్నారు. ఏళ్లతరబడి పాతుకు పోయిన సిబ్బంది డీఎంఓను కూడా లెక్క చేయడం లేదని తెలిసింది.
ఆయన డీఎంహెచ్‌ఓ కార్యక్రమాల్లో నిమగ్నమవుతుండగా, సిబ్బంది మాత్రం ఎవరిష్టం వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని మలేరియా విభాగం సిబ్బంది తీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని, వారి విధులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ఉంది.
‘మలేరియా’ కార్యక్రమాల నిర్వహణ సిబ్బందిపై పర్యవేక్షణ లేని వైనం ఎప్పుడొస్తారో.. వెళ్తారో తెలియదు పాజిటివ్ కేసులు వస్తున్నా పట్టించుకోరు నగరంలోని మలేరియా సిబ్బంది తీరుమారదా
చర్యలు తీసుకుంటాం
సరిగా విధులు నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి. అవినీతిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
–మోతీబాబు, ఇన్‌చార్జి డీఎంఓ
ఏళ్ల తరబడి ఇక్కడే
వీఐపీల్లా వచ్చి వెళ్తారు
అవినీతి కంపు
స్పందన ఏదీ..
Comments
Please login to add a commentAdd a comment