ఓవరాక్షన్‌పై యాక్షన్!
తిరువూరు: తరచూ వివాదాల్లో తలదూరుస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఇటీవల ఏ.కొండూరు మండలం గోపాలపురంలో ఒక గిరిజన మహిళా వార్డు సభ్యురాలిని ఇష్టానుసారం తిట్టి, కొట్టిన సంఘటనపై ఎమ్మెల్యే తీరును ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. సోమవారం ఆయనను విచారణకు రావాలని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. అంతకుముందు తిరువూరు బస్టాండు సెంటర్లోని రెవెన్యూ శాఖకు చెందిన గ్రామ చావిడిని ప్రభుత్వ అనుమతి లేకుండా కూల్చివేయడంలో ఎమ్మెల్యే పాత్రపై అధిష్టానం ఆరాతీస్తోంది. ఏ కొండూరు మండలం కంభంపాడులో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి నివాసగృహాన్ని ప్రొక్లయిన్‌తో ధ్వంసం చేయడానికి యత్నించి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం, ఏకొండూరు మండలంలోని అటవీభూమిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు ప్రోత్సహించడం, తిరువూరులో ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలని ఎమ్మెల్యే ఆందోళన చేయడం తదితర అంశాలు టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుని విచారణ జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగతంగా ఆర్థికసాయం చేసేందుకు వచ్చే అర్జీలలోని ఫోన్ నంబర్లకు, చిన్నస్థాయి మహిళా ఉద్యోగుల ఫోన్ నంబర్లకు వేళకాని వేళలో ఎమ్మెల్యే నుంచి కాల్స్ వెళ్లడం వివాదాస్పదమైంది.
ఆది నుంచీ అదే వైఖరి..
● సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొలికపూడి శ్రీనివాసరావు ప్రచార సమయంలోనే వివాదాలకు తెరతీశారు.
● రాజుపేట 2వ వార్డులో మురుగుకాలువలను నగరపంచాయతీ అధికారులు శుభ్రపరచట్లేదని ఆగ్రహించిన ఆయన ఎన్నికవడానికి ముందే మున్సిపల్ కమిషనర్‌కు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ సీనియర్లను సైతం ప్రచార సమయంలో పక్కనపెట్టిన ఆయన.. అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు.
● ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత ఇసుక, గ్రావెల్ తవ్వకాలు, జూదాలకు అనుమతి ఇవ్వడంలో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో చిట్టేల గ్రామసర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై బాహాటంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
● ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో భయాందోళనలకు గురైన సర్పంచి భార్య, కోకిలంపాడు వీఆర్వోగా పనిచేస్తున్న కవిత ఆత్మహత్యాయత్నం చేయగా, టీడీపీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
● తిరువూరు పట్టణంలోని మెయిన్‌రోడ్డులో డ్రెయినేజీలను శుభ్రపరిచే సమయంలో చిన్న దుకాణాలు తొలగించే విషయంలో ఎమ్మెల్యే తీరు విమర్శలకు దారి తీసింది.
● ప్రభుత్వం కేటాయించే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా ముఖ్య నాయకులు, పార్టీ గెలుపునకు శ్రమించిన వ్యక్తులను విస్మరించి తనకు అడుగులకు మడుగులొత్తే వారి పేర్లను అధిష్టానానికి పంపిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో గందరగోళానికి తెరతీశారు.
● తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఎమ్మెల్యేకి ప్రభుత్వం ఇచ్చే సిఫారసు లేఖలను కూడా ఇతర ప్రాంతాల్లోని తన అనుచరులకు కేటాయిస్తూ నియోజకవర్గ నేతలకు మొండిచేయి చూపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
● తిరువూరు డివిజన్లో కొత్తగా మంజూరైన 22 రేషన్ డీలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులందరినీ తమ కార్యాలయానికి రావాలని ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది.
● సంక్రాంతి పండుగ సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో జూదాలకు అనుమతి ఇవ్వడంలోనూ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు గందరగోళానికి గురిచేయగా, తొలుత జూదాలు వద్దని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా హెచ్చరించిన ఆయన కోడిపందేల బరిలోనే హడావుడి చేయడం మామూళ్ల కోసమేనని విమర్శలొచ్చాయి.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ అధిష్టానం గుర్రు విచారణకు రావాలని ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి పిలుపు ఆది నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment