ఒక్క రూపాయి పెట్టుబడి తేలేదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజాధనం రూ. 100 కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లిన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఈ పర్యటనతో రాష్ట్రానికి రూపాయి కూడా పెట్టుబడులు రాలేదని ఆయన విమర్శించారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దావోస్ సమ్మిట్‌లో మహారాష్ట్ర రూ.2 లక్షల కోట్లు, తెలంగాణ రూ.50 వేల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారని, కానీ ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. కేవలం నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారన్నారు. లోకేష్‌ను డెప్యూటీ సీఎం చేయాలనే ఆకాంక్షతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఐదు సార్లు వెళ్లినా, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒకసారి వెళ్లిన దానితో సమానం అన్నారు. కావాల్సినన్ని పెట్టుబడులు వైఎస్ జగన్ తెచ్చారన్నారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తాము గర్వంగా చెప్పగలమన్నారు.
తూర్పు బైపాస్‌పై మౌనం..
విజయవాడ తూర్పు బైపాస్‌పై ప్రకటనలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు దానిని పక్కన పెట్టేశారన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్, ఎంపీలు కేంద్రంతో మాట్లాడి తూర్పు బైపాస్‌కి ఒప్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి పనిలో కలెక్షన్‌లు వెతుక్కునే పనిలో పాలకులు ఉన్నారన్నారు. సమావేశంలో కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, కడియాల బుచ్చిబాబు, ఆళ్ల చెల్లారావు పలువురు నాయకులు పాల్గొన్నారు.
దావోస్ పేరుతో రూ.100కోట్ల
ప్రజాధనం వృథా
లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే
అన్నట్లు పర్యటన
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా
అధ్యక్షుడు దేవినేని అవినాష్
Comments
Please login to add a commentAdd a comment