మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మక్కపేట(వత్సవాయి): తెగుళ్లు సోకి నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. మండలంలోని మక్కపేట గ్రామంలో దెబ్బతిన్న మిర్చి పంటలను శనివారం ఆయన జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల ఇన్‌చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, మొండితోక జగన్‌మోహన్‌రావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఎకరానికి కనీసం తక్కువలో తక్కువగా రూ.50 వేల వరకు నష్టం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా నల్లి, దొప్ప వైరస్‌ల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. పెట్టుబడులు పూర్తయి పంట చేతికి వచ్చే సమయంలో వచ్చిన నల్లి కారణంగా తీవ్రంగా నష్టం జరిగిందని చెప్పారు. మిర్చి పంటకు క్వింటాకు కనీసం రూ.20 వేలు మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నష్టపోయిన రైతులను గుర్తించి వారికి క్రాప్ ఇన్సూరెన్స్ అందించాలన్నారు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మిర్చి పంట నష్టపోయిన రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరానికి రూ.49 వేల వరకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకున్నట్లు గుర్తుచేశారు. ఈ ప్రభుత్వంలో నేటి వరకు పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు. గత సీజన్‌లో మిర్చి క్వింటా రూ 24 వేల వరకు పలకగా ప్రస్తుతం రూ 10 వేలు కూడా రైతుకు అందే పరిస్థితి లేదన్నారు. తక్షణమే మిర్చి రైతుకు గిట్టుబాటు ధర అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వేధిస్తున్న యూరియా కొరత..
ప్రస్తుతం యూరియా కొరత కూడా తీవ్రంగా వేధిస్తోందని అవినాష్ చెప్పారు. యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. గతంలో ఆర్‌బీకేల ద్వారా రైతుకు కావాల్సిన ఎరువులు పుష్కలంగా అందేవని రైతులు గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు. అనంతరం రైతులతో కలిసి సమావేశం నిర్వహించి వారి ఆభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, ఎంపీపీ కొలుసు రమాదేవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కనగాల రమేష్, భాస్కరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు వట్టెం మనోహర్, చౌడవరపు జగదీష్, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం మాజీ డైరెక్టర్ నంబూరి రవి, జిల్లా పార్టీ నాయకులు ఏలూరి శివాజీ, వేమిరెడ్డి వెంకటనారాయణరెడ్డి, చల్లా వైకుంఠరావు, బద్రునాయక్, పెంటి శ్రీనివాసరావు, మండవ శ్రీనివాస్‌గౌడ్, బూడిద నరసిహరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, కొమ్మినేని రవిశంకర్, బత్తుల రామారావు, లేళ్ల నాగేంద్రరెడ్డి, సర్పంచ్ కొట్టె నగేష్, రైతులు పాల్గొన్నారు.
కనీస మద్దతు ధర
రూ.20 వేలు అందించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
Comments
Please login to add a commentAdd a comment