కలెక్టర్ లక్ష్మీశకు బెస్ట్ ఎలక్ట్రోలర్ అవార్డు
భవానీపురం(విజయవాడపశ్చిమ): కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశకు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్–2024 లభించింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడం, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ఓటర్లను జాగృతం చేయడం తదితర అంశాల్లో అత్యుత్తమ పని తీరు కనబరిచినందుకుగాను లక్ష్మీశకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ ఎన్.రమేష్ కుమార్, జాయింట్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ లక్ష్మీశను అభినందించారు.
పదో తరగతి విద్యార్థులకు నగదు బహుమతులు
జి.కొండూరు: మండలంలోని వెలగలేరు చనమోలు పకీరాయుడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రతిభచా టిన విద్యార్థులకు చనమోలు లక్ష్మీకాంతమ్మ, వెంకటరామయ్య మెమోరియల్ ట్రస్టు నుంచి శనివారం రూ.1.75 లక్షలను నగదు బహు మతులు అందజేశారు. పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో 29 మంది విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం కె.పద్మ, చనమోలు అనిల్‌కుమార్(బాబ్జి), ట్రస్టు నిర్వాహకులు చనమోలు శ్రీధర్, నాగమల్లేశ్వరరావు, రామ్మోహన్‌రావు, సీతారావమ్మ పాల్గొన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని వినతి
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసులు పాల్పడుతున్న దాడులను నియంత్రించి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలని డీజీపీ సీహెచ్.ద్వారకాతిరుమలరావును బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి కోరారు. డీజీపీ ద్వారకాతిరుమలరావును ఆయన కార్యాలయంలో బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్(రాజా), సభ్యుడు చక్రవర్తితో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సోషల్ ఇంజినీర్లుగా పని చేస్తున్న న్యాయవాదులపై పోలీసులు దాడులు పాల్పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. న్యాయవాదులతో పోలీస్ వ్యవస్థ స్నేహభావంతో మెలగాలని, సమానత్వంతో శాంతిభద్రతలను పరిరక్షించాలని డీజీపీని కోరారు.
జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో జిల్లాకు బహుమతులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పుదుచ్చేరిలో జరిగిన దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెయిర్‌లో జిల్లా లోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు బహుమతులు సాధించారని జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ తెలిపారు. జగ్గయ్యపేట జీవీజే జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎం.నాగతేజ, వై.భర్గవధనుష్ ఉపాధ్యాయుడు జి.చంద్రశేఖర్ పర్యవేక్షణలో ప్రదర్శించిన ప్రొటెక్టింగ్ వెహికిల్స్ అండ్ బ్రిడ్జిస్ ఫ్రమ్ ఫ్లడ్స్ అంశానికి గ్రూప్ కేటగిరీలో మూడో బహుమతి సాధించిందని పేర్కొన్నారు. గంపలగూడెం ఏపీ మోడల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సీహెచ్ సుదీక్ష ప్రదర్శించిన వయోవృద్ధుల కోసం ట్రాలీ రోబోట్ అంశం ఐదో బహుమతి సాధించిందని, విద్యార్థులను డీఈఓ సుబ్బారావు అభినందించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment