No Headline
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సౌకర్యాలు కరువయ్యాయి. కనీసం ఒక్క ఆపరేషన్ థియేటర్ కూడా అందు బాటులో లేకపోవడంతో ఇక్కడకు వచ్చిన రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందడంలేదు. ఆపరేషన్ అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిన చందాదారులకు ఈఎస్‌ఐ కింద ఈ సేవ అందదు.. ఆ సేవ అందదు అంటూ రూ.వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. సూపర్‌స్పెషాలిటీ విభాగాల సంగతి అలా ఉంచితే స్పెషాలిటీ విభాగాలైన ఈఎస్‌టీ, నేత్ర వైద్య విభాగాలు కూడా ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన చందాదారులు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆపరేషన్ థియేటర్ కూడా లేదు
ఈఎస్‌ఐ ఆస్పత్రికి వచ్చేది కార్మికలు, వారి కుటుంబ సభ్యులు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు వెచ్చించి వైద్యం పొందేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న ఆశతో గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రికి వస్తుంటారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ విభాగాల్లో గతంలో ఆపరేషన్‌లు నిర్వహించేవారు. వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. పాత భవనం శిథిలావస్థకు చేర డంతో దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. తాత్కాలికంగా రూ.5 కోట్లు అంచనాతో భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హాయాంలోనే ఈ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. సౌకర్యాలు కల్పించే దశలో ఎన్నికలు వచ్చాయి. అనంతరం ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు పూర్తయినా భవనాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రారంభోత్సవం చేసేశారు. ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో అప్పటి నుంచి శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి.
ఈఎస్‌టీ, నేత్ర వైద్య విభాగాలే లేవు
కార్మికులకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుందనే భావనంతో ప్రతి ఒక్కరూ తమకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరుతుంటారు. కానీ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చెవి–ముక్కు–గొంతు, నేత్ర వైద్యానికి సంబంధించిన విభాగాలే లేవు. దీంతో ఆ రెండు విభాగాలకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈఎస్‌ఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రుల్లో సరైన సేవలు అందడం లేదని చందాదారులు అంటున్నారు. నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అన్నీ ప్రైవేటుకే...
గతంలో ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో వైద్యం అవసరమైన వారిని మాత్రమే ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్‌చేసే వారు. అందుకోసం పలు ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్, జనరల్‌సర్జరీ, గైనకాలజీ విభాగాల్లో శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని సైతం ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్‌చేస్తున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రి రిఫరల్ ఆస్పత్రి. ఇక్కడ వైద్య సేవలు లేక ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించాల్సిన దయనీయ స్థితి నెలకొంది. అలా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిన వారు మరలా అక్కడ చేరిన తర్వాత, వారు ఇచ్చే లెటర్‌ను తీసుకుని ఈఎస్‌ఐ ఆస్పత్రికి వచ్చి, వైద్యం చేసేందుకు అనుమతి లెటర్ తీసుకెళ్లాల్సి రావడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
4 జిల్లాలకు సేవలందించే ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ కరువు పేరుకే రిఫరల్ ఆస్పత్రి.. అన్ని కేసులు ప్రైవేట్ ఆస్పత్రులకే.. ఈఎన్‌టీ, ఆప్తమాలజీ విభాగాలు లేని వైనం ఆస్పత్రి పరిధిలో ఆరు లక్షల మంది ఈఎస్‌ఐ చందాదారులు
Comments
Please login to add a commentAdd a comment