గణతంత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు
విజయవాడస్పోర్ట్స్: ఇందిరాగాంధీ స్టేడియంలో ఆదివారం ఉదయం 8.30 నుంచి 10.40 గంటల వరకు జరిగే 76వ గణతంత్ర వేడుకలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. స్టేడియం పరిసరాలలో ఆయన శనివారం పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై దిశానిర్ధేశం చేశారు. స్టేడియం పరిసరాల్లో భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబునాయుడు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఉన్నతాధికారులు, పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు వస్తారని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, ఉమామహేశ్వరరాజు, ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్వీడీ ప్రసాద్ పాల్గొన్నారు.
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఆ సమయంలో కంట్రోల్ రూమ్ వైపు నుంచి బెంజిసర్కిల్ వైపునకు, రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్‌కు, శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్‌కు వాహనాలను అనుమతించమన్నారు.
● బస్టాండ్ నుంచి బెంజిసర్కిల్‌కు ఎంజీ రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలు ఆర్టీసీ వై.జంక్షన్ నుంచి ఏలూరు రోడ్డు స్వర్ణప్యాలెస్ మీదుగా దీప్తి సెంటర్, చుట్టుగుంట, పడవలరేవు, గుణదల, రామవరప్పాడురింగ్ నుంచి బెంజిసర్కిల్‌కు ఒక మార్గంగా ఉంటుందన్నారు. ఆర్టీసీ వై.జంక్షన్ నుంచి బందర్ లాకులు, రాఘవయ్య పార్క్, పాత ఫైర్ స్టేషన్ రోడ్, అమెరికన్ హాస్పిటల్, మసీద్ రోడ్, నేతాజీ బ్రిడ్జి, గీతానగర్, స్క్యూ బ్రిడ్జి మీదుగా బెంజ్ సర్కిల్ వైపునకు మరో మార్గంగా మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
● బెంజిసర్కిల్ నుంచి ఎంజీ రోడ్డులోకి వచ్చే వాహనాలను ఫకీర్‌గూడెం, స్క్యూ బ్రిడ్జి, నేతాజీ బ్రిడ్జి, బస్టాండ్ మార్గాన్ని అనుసరించాలి.
● బెంజిసర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా కూడలి వరకు ఎంజీ రోడ్డుపై ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తామన్నారు.
● ఐదో నంబర్ రూట్‌లో వెళ్లే బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment