రాయగడ: విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన రాయగడలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఇందిరానగర్ ఐదో లైన్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు మనోరంజన్ నాయక్ పనిచేస్తున్నాడు. అతడు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తరగతులు ముగిసిన అనంతరం తరగతి గదిలోకి విద్యార్థినులను రమ్మని పిలిచి వారిపై చేతులు వేసి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుండేవాడు. ఈ విషయం ఎవరికై నా చెబితే పర్యవసనాలు వేరుగా ఉంటాయని భయపెడుతుండేవాడు. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థినులు పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతుండేవారు. మరి కొందరు అసలు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో అనుమానం వచ్చిన కొంతమంది విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని అడగగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో కోపోద్రోకులైన తల్లిదండ్రులు పాఠశాలకు బుధవారం వెళ్లి ఆందోళన చేశారు.
హెచ్‌ఎంకు ఫిర్యాదు
పాఠశాల వద్ద ఆందోళన అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయుడి ప్రవర్తనపై హెచ్‌ఎం ప్రమిలా పండకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అతనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయమై తన దృష్టికి ఎటువంటి ఆరోపణలు రాలేదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎం పండ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి ఉపాధ్యాయుడి వికృత చేష్టలపై హెచ్‌ఎంకు వివరించారు. అనంతరం ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment